ఠాక్రే తొలి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే మహారాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కేబినెట్ భేటీ నిర్వహించారు ఉద్ధవ్ ఠాక్రే. సహ్యాద్రి అతిథి గృహంలో ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే కేబినెట్ భేటీ నిర్వహించారు ఠాక్రే.
తొలి నిర్ణయం
ఛత్రపతి శివాజీ రాజధాని... రాయ్‌గఢ్ కోట సంరక్షణ కోసం రూ.20 కోట్ల విడుదలకు మహారాష్ట్ర తొలి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి రూ.606 కోట్లతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
రైతుల సంక్షేమం..
ఈ సందర్భంగా మహారాష్ట్రను అభివృద్ధి కృషి చేస్తామని ఠాక్రే వెల్లడించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కంటితుడుపు చర్యలతో ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రివర్గ విస్తరణపై కసరత్తు..
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేతో పాటు 3 పార్టీలకు చెందిన ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో శివసేన నుంచి ఏక్నాథ్ శిందే, సుభాష్ దేశాయి.. ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్ ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఆరుగురు సభ్యులతో కొలువైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ కేబినెట్ను పూర్తిస్థాయిలో డిసెంబర్ 3న విస్తరించనున్నారు. ఈ మేరకు అఘాడీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి సహా మంత్రుల వివరాలపై ఆరోజున స్పష్టత రానుంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే పంపకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. శివసేనకు కేబినెట్‌లో 16 బెర్తులు, ఎన్సీపీకి 15, కాంగ్రెస్‌కు స్పీకర్ సహా 13 మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్‌కు దక్కే 13 బెర్తుల్లో 9 కేబినెట్, 4 సహాయ మంత్రి పదవులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేనాని 'ఠాక్రే'