మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు లేఖలు రాశారు మరాఠీ మంత్రులు ఏక్నాథ్ శిందే, ఛాగన్ భజ్బుల్. బెల్గాం ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 6 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"బెల్గాంను మహారాష్ట్రలో కలుపుకొనేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. అది జరిగిన రోజు చారిత్రకం అవుతుంది. ఆ ప్రాంత ప్రజలకు మేం అండగా ఉన్నాం. 6 దశాబ్దాలకు పైగా దీనిపై పోరాటం జరుగుతోంది. త్వరలోనే బెల్గాం, కార్వార్, నిపాని, బీదర్, భాల్కీ ప్రాంతాలను మహారాష్ట్రలో చేర్చుతాం. ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. యెల్లూర్ ప్రజలపై జరిగిన దాడులను మరాఠీలు తీవ్రంగా వ్యతిరేకించారు.''