కరోనా.. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా, ఏ ఇద్దరి మధ్యనైనా దీనిపైనే చర్చ. సోషల్ మీడియాలో ఓ వార్త వస్తుంది... ఓ పోస్టు చూస్తాం.. ఎన్నో అనుమానాలు రేగుతాయి.. నిత్యం రకరకాల రూపాల్లో ఎన్నో వార్తలొస్తున్నాయి. వీటిలో తప్పక తెలుసుకోదగ్గ విశ్వసనీయమైన సమాచారమూ ఉంటోంది.. కాదనలేం. తప్పుడు ప్రచారాలూ, వదంతులే ఎక్కువ ఉంటున్నాయి. కొవిడ్-19పై సరైన, అవసరమైన సమాచారం కాకుండా దుష్ప్రచారాలను నమ్మితే ప్రజల్లో అనవసర భయాందోళనలు రేగుతాయి. మానసిక ఒత్తిడీ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారిని కట్టడి చేయాలంటే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగాను ప్రజలు దృఢంగా ఉండటం చాలా అవసరమని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కరోనాపై భయాందోళనలను ఎలా దూరం చేసుకోవచ్చో సూచిస్తున్నారు.
ఏ వార్తలను నమ్మాలి?
కరోనా ఉనికి ప్రపంచానికి తెలిసింది మొదలు వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలొస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా సమాచారం ప్రవహిస్తోంది. ఇన్ని ఎక్కువ విషయాలు తెలుస్తున్నప్పుడు వాటిలో ఏది విశ్వసనీయం? ఏది అవసరం? ఏది నమ్మాలి? ఏవి పాటించాలి? వంటి అంశాలపై స్పష్టత లేకపోతే నష్టమే ఎక్కువ. మానసిక ఆందోళనలూ పెరిగిపోతాయి. ఇలాంటి సమయాల్లో ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లు, ఇతర ప్రసార సాధనాలు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పత్రికలను ఇళ్లకు చేరవేస్తూ వార్తలందిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడి.. ఎన్నో దశల్లో నిజమా? కాదా? అన్నది నిర్ధారించుకుని.. ప్రజలకు అవసరమైన, విశ్వసనీయ సమాచారాన్నే నిక్కచ్చిగా అందజేస్తుంటాయి. మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి వార్తల్నే విశ్వసించాలి.
దుష్ప్రచారం నమ్మవద్దు
వివిధ సామాజిక మాధ్యమాల్లో అనవసర సమాచారంతోపాటు దుష్ప్రచారం ప్రబలంగా జరుగుతోంది. ‘ఇది ముట్టుకోవద్దు, అది తినొద్దు, ఫలానాది తింటే తగ్గిపోతుంది.. ఇలా చేస్తే కరోనా రాదు.. వంటి ఎన్నో వదంతులు ప్రచారమవుతున్నాయి. ఇవి ప్రజల్లో అపోహలను, భయాందోళనలను సృష్టించడమే కాకుండా.. తప్పుదోవ పట్టిస్తున్నాయి. శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి శాస్త్రీయమైన సూచనలు, జాగ్రత్తలు పాటించాలి తప్ప.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కరోనాపై ప్రముఖ మీడియా సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు అందించే సమాచారానికి పరిమితమైతేనే మేలు. కరోనాపై అవగాహన కల్పించే అంశాలు, అవసరమైన జాగ్రత్తలు తెలుసుకుంటే సరిపోతుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చేవన్నీ నిజమేనని నమ్మొద్దు. సమాజం కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి.
పిల్లలను చైతన్యపరచండి