కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. యడియూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన అనంతరం స్పీకర్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే నిన్న ఆయన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని సమాచారం. కూటమి ప్రభుత్వ పతనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడం వల్ల తన బాధ్యత పూర్తయినట్లు భావించారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి చెందిన స్పీకర్ కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం వైపు మొగ్గారని కూటమి నేతల సమాచారం.
కర్ణాటకం లైవ్: స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా - విధానసభ
12:25 July 29
స్పీకర్ రాజీనామా...
11:58 July 29
మూజువాణి ఓటుతో గెలుపు...
కర్ణాటకలో జరిగిన విశ్వాసపరీక్షలో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. కూటమి సర్కారు పతనం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడియూరప్ప సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు గానూ ఏకవాక్య తీర్మానంతో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం యడియూరప్ప, విపక్షనేత సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడిన అనంతరం బలపరీక్ష నిర్వహించారు. యడియూరప్ప మూజువాణి ఓటుతో గెలుపొందారు
11:44 July 29
యడియూరప్ప గెలుపు...
విశ్వాసపరీక్షలో యడియూరప్ప గెలుపొందారు. మూజివాణి ఓటింగ్ ద్వారా భాజపా సర్కారు గెలుపొందింది.
11:42 July 29
'రెబల్స్‌ను రోడ్డుపాలు చేశారు'
అధికార భాజపాపై కుమారస్వామి విమర్శలు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు.
11:38 July 29
'14 నెలలు ప్రభుత్వం నడిపాను'
చర్చలో మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడారు. 14 నెలల పాటు తాను ప్రభుత్వాన్ని నడిపానని ప్రస్తావించారు. యడియూరప్ప ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తాను ఏం చేశాను అన్నది ప్రజలకు తెలుసని అభిప్రాయపడ్డారు.
11:19 July 29
'ప్రజలకు మంచి చేయండి'
బలపరీక్షపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన యడియూరప్ప సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై యడియూరప్ప చేసిన విమర్శలను సిద్ధరామయ్య ఖండించారు.
11:13 July 29
విశ్వాస తీర్మానం...
సభలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు సీఎం యడియూరప్ప. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి హయాంలో పరిపాలన నిలిచిపోయిందని ఆరోపించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు.
11:06 July 29
మొదలైన సభ...
కర్ణాటక విధానసభ ప్రారంభమైంది. భాజపా, కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు సభకు హాజరయ్యారు. కాసేపట్లో యడియూరప్ప సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది.
10:39 July 29
ముగిసిన సీఎల్పీ భేటీ...
విధానసౌధలో కాంగ్రెస్ శాసనసభ్యుల భేటీ ముగిసింది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్ష నాయకుడి ఎంపికపై సభ్యులు చర్చించినట్లు సమాచారం.
10:27 July 29
సుప్రీం ముందుకు రెబల్స్...
అనర్హత వేటుపడిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఇద్దరు కాంగ్రెస్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ జార్ఖిహొళి, మహేశ్ కుమటహళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్ ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
10:17 July 29
కాంగ్రెస్ సభ్యుల భేటీ...
విధానసౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమైంది. సిద్ధరామయ్య, దినేష్ గుండూరావు సమావేశంలో పాల్గొన్నారు. కేజే జార్జి, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే తదితరులు హాజరయ్యారు.
10:14 July 29
భాజపా గెలుపు ఖాయమా..?
కొత్తగా ఏర్పాటైన భాజపా ప్రభుత్వం కాసేపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. 17మందిపై వేటుతో సభలో సభ్యుల సంఖ్య 207కు చేరింది. సభ విశ్వాసం పొందాలంటే 104 మంది సభ్యుల మద్దతు అవసరం. భాజపాకు ఎవరి మద్దతు లేకుండానే 105 మంది బలం ఉంది. విశ్వాసపరీక్ష అనంతరం ఆర్థిక బిల్లు ప్రవేశపెడతామని ఇప్పటికే సీఎం యడియూరప్ప ప్రకటించారు.
10:07 July 29
బలపరీక్షకు ముందు పూజలు...
బలపరీక్ష కోసం విధానసభకు హాజరయ్యేముందు ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరులోని శ్రీ బాల వీరాంజనేయ ఆలయాన్ని సందర్శించారు.
10:03 July 29
విధానసభకు చేరుకున్న యడ్డీ...
కాసేపట్లో బలపరీక్ష ఎదుర్కోనున్న ముఖ్యమంత్రి యడియూరప్ప విధానసభకు చేరుకున్నారు. భాజపా శాసనసభ్యులందరూ సభకు తప్పక హాజరు కావాలని ఇప్పటికే విప్ జారీ చేశారు.
09:55 July 29
కాసేపట్లో బలపరీక్ష
- కాసేపట్లో యడియూరప్ప సర్కార్‌కు బలపరీక్ష
- పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసిన భాజపా
- నేడు విధానసభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ