అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మనదేశంలో పర్యటించనున్నారు. ఆయన రాకతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. అదే సమయంలో వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రధానంగా ఏయే అంశాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయంటే..
వాణిజ్య ఒప్పందం సంతకం పెట్టేస్తారా?
ట్రంప్ రాక నేపథ్యంలో ప్రధానంగా వాణిజ్య ఒప్పందంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాజా పర్యటనలో ఈ ఒప్పందం కుదరడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. సరైన రీతిలో వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదిస్తే సంతకం చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు కూడా. ఈ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రస్తుతం విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న అధిక సుంకాలను మినహాయించాలని, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్(జీఎస్‌పీ) కింద కొన్ని దేశవాళీ ఉత్పత్తులకు ఎగుమతి సంబంధిత ప్రయోజనాలను పునరుద్ధరించాలని భారత్ డిమాండు చేస్తోంది. వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని పట్టుపడుతోంది. మరోవైపు- అమెరికా కూడా తమ పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు మార్కెట్ సదుపాయాన్ని పెంచాలని.. సమాచార, కమ్యూనికేషన్, సాంకేతికత(ఐసీటీ) ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండు చేస్తోంది.
రక్షణ రంగం కొనుగోళ్లకు సై
ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్)’ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అమెరికా సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్ నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర ‘ఎంహెచ్-60ఆర్’ సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.