భారత పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యలు భారతదేశ గౌరవానికి అవమానకరమని తీవ్రంగా విమర్శించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే విధంగా స్పందించాలని ఉద్ఘాటించింది.
ఈ విషయం చాలా తీవ్రమైనదని కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా భారత్-అమెరికాల మధ్య ఏర్పడిన బంధాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని అన్నారు. ట్రంప్ పర్యటన వ్యూహాత్మకంగా లేదని, ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉందని ఎద్దేవా చేశారు.
"భారత్ పర్యటనకు తొలిసారి రానున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ గౌరవానికి అవమానకరమని భావిస్తున్నాను. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించాలి."
-మనీశ్ తివారీ, కాంగ్రెస్ ప్రతినిధి