అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్ నుంచి బయల్దేరి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్, మెలానియా దంపతులు తొలి రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించిన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్ ఉన్నారు.
అట్టహాసంగా కార్యక్రమాలు..
తొలుత అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ట్రంప్, మెలానియా దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు ప్రపంచ అగ్రరాజ్య అధిపతికి అడుగడుగునా స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్రమాలను వేశారు. అనంతరం ట్రంప్, మెలానియా చరఖాను తిప్పారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. అక్కడి నుంచి మోతెరా మైదానానికి చేరుకొని ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విమానంలో ఆగ్రాకు బయల్దేరారు. తాజ్‌మహల్ అందాలను తిలకించిన ట్రంప్ దంపతులు.. ఆ పురాతన పాలరాతి కట్టడం విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీ చేరుకున్నారు.