తొలిసారిగా భారతదేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అహ్మదాబాద్, దిల్లీతో పాటు ఆగ్రాకూ వెళ్లనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను ఆయన సతీ సమేతంగా సందర్శిస్తారు. 24వ తేదీన ఆయన నేరుగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ అక్కడ స్వాగతం పలకనున్నారు. దాదాపు 22 కి.మీ. మేర సాగే రోడ్‌షోలో వారికి భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలుకుతారు.
ఆగ్రాలో స్వాగతం పలకున్న యోగి
అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమానికి ట్రంప్, మోదీ వెళ్తారు. వివిధ వర్గాల వారితో ముచ్చటిస్తారు. భారీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ట్రంప్ దంపతులు ఆగ్రాకు వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి అక్కడ స్వాగతం పలుకుతారు.