చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతమైన దీపావళి పర్వదినం నాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖతా ఓ శుభవార్త వెలువడింది. కరడుగట్టిన ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అధిపతి అబు బకర్ అల్ బాగ్దాదీ అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ కైలా ముల్లెర్’లో కడతేరిపోయాడన్న సమాచారంతో- మరో ‘లాడెన్’ పీడ విరగడైందన్న సంతోషం దేశదేశాల్లో వ్యక్తమవుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) పేరిట పశ్చిమాసియాలో కుబుసం విడిచిన ఉగ్రనాగు దేశాల సరిహద్దుల్నే తిరగరాసే దీర్ఘకాల లక్ష్యాల వల్లెవేతతో 2014 జులైలోనే తన పేరును ఇస్లామిక్ స్టేట్ (ఇస్లాం రాజ్యం)గా మార్చుకొంది.
దారుణ మారణహోమంతో ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న దాని అధిపతి బాగ్దాదీ తలకు రెండున్నర కోట్ల డాలర్ల వెలను అమెరికాయే నిర్ణయించింది. 2017లో సిరియాలోని రక్కా నగరంపై తాము జరిపిన భీకర దాడుల్లో బాగ్దాదీ హతమారిపోయి ఉంటాడని రష్యా ప్రకటించినా, అమెరికా దాన్ని విశ్వసించలేదు. సిరియాలో ఐఎస్ కోటల్ని కూలగొట్టడంలో స్థానిక కుర్దుల తోడ్పాటుతో విజయం సాధించిన అగ్రరాజ్యం- సంక్షుభిత ప్రాంతం నుంచి వైదొలగే క్రమంలో చేపట్టిన ఆపరేషన్ ఇది! రష్యా, ఇరాక్, టర్కీల గగన తలాన్ని ఉపయోగించుకొంటూ బాగ్దాదీ రహస్య జీవనం గడుపుతున్న ఇడ్లిబ్‌లోని స్థావరంపై ఎనిమిది హెలికాప్టర్లతో విరుచుకుపడిన అమెరికా- దిక్కుతోచని స్థితిలో సొరంగంలోకి పరారైన బాగ్దాదీ అంతిమంగా ఆత్మాహుతికి పాల్పడి కుక్క చావు చచ్చాడని ప్రకటించింది. యావత్ ‘ఆపరేషన్’ను సినిమా మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించానన్న ట్రంప్- పట్టుమని పావుగంటలోనే డీఎన్‌ఏ పరీక్ష ద్వారా చనిపోయింది బాగ్దాదీయేనని నిర్ధారించడం, ఇంటాబయటా పోటెత్తుతున్న వ్యతిరేక పవనాల తాకిడి నుంచి ఉపశమనం పొందడానికేనన్న సంగతి తెలుస్తూనే ఉంది. బాగ్దాదీ మరణంతోనే ఐఎస్ మలిగిపోతుందా అన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని తొలుస్తూనే ఉంది!
‘ఉగ్రవాదంపై సమరం అల్‌ఖైదాతో మొదలవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఉగ్రసంస్థనూ గుర్తించి, నిరోధించి, ఓడించేదాకా ఆ పోరు నిర్నిరోధంగా సాగుతుంది’- సెప్టెంబరు 11నాటి భయానక దాడుల నేపథ్యంలో శ్వేత సౌధాధిపతిగా జార్జి బుష్ చేసిన ప్రతిజ్ఞ అది. అఫ్గాన్‌లో తిష్ఠ వేసిన తాలిబన్ ప్రభుతను, దాని మద్దతుతో ఎంతకైనా తెగిస్తున్న అల్‌ఖైదాను ఖతం చెయ్యడమే అజెండాగా జార్జిబుష్ ప్రారంభించిన ‘ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు’లో వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్థాన్ కుదురుకొంది.
అగ్రరాజ్యం తాలిబన్ల తలకొట్టి మొలేశాక అల్‌ఖైదా అగ్రనేత బిన్ లాడెన్‌కు సురక్షిత స్థావరంగా పాకిస్థానే అక్కరకొచ్చింది! 2011 మే నెలలో అమెరికన్ దళాలు సాగించిన రహస్య ఆపరేషన్‌లో బిన్ లాడెన్ హతమారిపోవడాన్ని నాటి ఒబామా ప్రభుత్వమూ ఇప్పటిలాగే ప్రపంచానికి ఘనంగా చాటింది. లాడెన్‌ను మట్టుబెట్టడం కంటే బాగ్దాదీని వేటాడటమే మరింత ఘనకార్యమని చాటుకోవడంలో ట్రంప్ రాజకీయ లక్ష్యాలు ఏమైనప్పటికీ- అల్‌ఖైదాకు భిన్నమైన ముస్లిం రాజ్య విస్తరణ అజెండాతో ఐఎస్ అధిపతి సాగించిన మారణహోమం దేశదేశాల సమగ్రతకే చిచ్చుపెట్టేటంత భయానకమైనది.