మహిళల రక్షణ కోసం.. కేంద్రం తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్ చెబితే.. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షను విధించే నిబంధన చెల్లుబాటుపై పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది.
తలాక్ చట్టంలో శిక్షార్హమైన నేరం, జైలు శిక్ష వంటి నిబంధనలను పరిశీలించాల్సిందిగా అభ్యర్థించారు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్. ఈ వ్యాజ్యంపై కేంద్రం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం.