సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మంగళవారం భారత్- చైనా ఒకే వేదికపైకి రానున్నాయి. రష్యాతో జరగనున్న త్రైపాక్షిక కూటమి సమావేశంలో భారత విదేశాంగమంత్రి జయ్శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్, చైనా, రష్యా త్రైపాక్షిక భేటీ- కీలకాంశాలపై చర్చ - భారత్ చైనా రష్యా త్రైపాక్షిక సమావేశం
భారత్, చైనా, రష్యా మధ్య నేడు త్రైపాక్షిక కూటమి సమావేశం జరగనుంది. ఇందులో మూడు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అయితే భారత్- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
నేడు చైనా, రష్యాతో భారత్ త్రైపాక్షిక భేటీ
కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక-సామాజిక అంశాలపై త్రైపాక్షిక కూటమి సమావేశంలో నేతలు చర్చించనున్నారు. అయితే భారత్-చైనా సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చే అవకాశముంది.
ఈ నెల 15న గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చైనా పొట్టనబెట్టుకుంది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది భారత్. ఈ నేపథ్యంలోనే త్రైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొనవద్దని భావించింది. అయితే రష్యా అభ్యర్థన మేరకు భారత్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.