రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ స్వతంత్రంగా వ్యవహరించారు. కేవలం రబ్బరు స్టాంప్‌లా మిగిలిపోకుండా తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించినప్పుడు రాజ్యాంగ పరిధి దాటకుండానే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలతోనూ ఆయన ఒకే రకంగా వ్యవహరించారు. ప్రణబ్‌దా రాజకీయ ప్రస్థానం మొత్తం కాంగ్రెస్‌తోనే. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు జనవరి 25న ఆయన ప్రసంగం గమనిస్తే కాంగ్రెస్‌వాది నుంచి రాష్ట్రపతిగా ఆయన పూర్తిగా ఎలా మార్పు చెందిందీ అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి.
"అవినీతి అనేది క్యాన్సర్. అది ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టేస్తుంది. మన దేశ పునాదులను కదిలించివేస్తుంది. భారతీయులు కోపగించుకుంటున్నారంటే దానికి కారణం.. తమ కళ్ల ముందే అవినీతి జరగడం, దేశవనరులు వృథా కావడమే. ఈ లోపాలను సరిదిద్దకపోతే ఓటర్లు ప్రభుత్వాలను తొలగిస్తారు."
-ప్రణబ్ ముఖర్జీ
ప్రభుత్వం మారినా.. పంథా మారలే
ఆయన కాంగ్రెస్‌వాదిగా కాకుండా స్వతంత్రుడైన రాష్ట్రపతిగా పూర్తిస్వేచ్ఛ తీసుకుని అప్పటి ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ప్రణబ్ తన స్వతంత్ర పంథాను కొనసాగించారు. రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించేవారు.
"శాసన వ్యవస్థ పని చేయకుండా పరిపాలన అనేది ఉండజాలదు. శాసనవ్యవస్థ ప్రజల మనసును ప్రతిఫలిస్తుంది. ఈ వేదిక ద్వారా అర్థవంతమైన చర్చలు చేపట్టి, చట్టాలు చేసి ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి."
"మన దేశ అంతఃచేతనలో లౌకికవాద భావన బాగా పాతుకుపోయి ఉంది. సుహృద్భావ సమాజ నిర్మాణానికి మన యువతరం మనసుల్లో ఈ భావనను మరింత బలోపేతం చేయాల్సి ఉంది."
- ప్రణబ్‌ముఖర్జీ
పార్లమెంట్ సభ్యుడిగా విస్తృత అనుభవం ఉన్న ఆయన.. సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా వాయిదా పడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు అధికార పక్షానికి, ఇటు విపక్షానికి కూడా చురకలు వేశారు.
"పార్లమెంట్‌కు చట్టాలు చేసే బాధ్యత ఉంది. చర్చలు లేకుండా చట్టాలు చేస్తే పార్లమెంట్ బాధ్యతలపై ప్రభావం చూపించినట్లే. పార్లమెంట్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లే. ఈ ధోరణి అటు ప్రజాస్వామ్యానికీ మంచిది కాదు. ఇటు ఆ చట్టాలకు సంబంధించిన విధానాలకూ మంచిది కాదు" అని 66వ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రణబ్ ఎన్‌డీఏ ప్రభుత్వానికి చురకలు వేశారు. సభలో విపక్షాలు అంతరాయాలు కలిగిస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం 11 ఆర్డినెన్స్‌లను ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పార్లమెంట్ తన బాధ్యతలను నిర్వర్తించనీయాలంటూ విపక్షానికీ గట్టిగా హితవు చెప్పారు.
ప్రజలకు మరింత చేరువగా రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి, రాష్ట్రపతి కార్యాలయమంటే ఎన్నో హంగులు, ప్రొటోకాల్స్. వీటిని మరింత సరళీకరించి వ్యవస్థను ప్రజలకు చేరువగా చేయాలనుకున్నారు ప్రణబ్. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ దిశగా ఆయన కార్యాలయం పలు చర్యలు ప్రకటించింది. రాష్ట్రపతిని అత్యంత గౌరవపూర్వకంగా సంబోధించే ‘హిజ్ ఎక్స్‌లెన్సీ’ అనే పదాన్ని తొలగించింది. దిల్లీలోని వివిధ చోట్ల జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనడం వల్ల ట్రాఫిక్ పరంగా, ఇతరత్రా సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సామాన్యులకు ఇబ్బందులు తగ్గించేందుకు వీలయినన్ని కార్యక్రమాలు రాష్ట్రపతి భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్‌కు అతిథులు వచ్చినప్పుడు ప్రొటోకాల్, భద్రత నిబంధనలను చాలావరకు సడలించారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రధాన పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు 2016లో మూడు పర్యాటక సర్క్యూట్లు- రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, రాష్ట్రపతి భవన్ మ్యూజియంను ప్రారంభించారు.
రాష్ట్రపతిగా రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రణబ్ పలు చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని ప్రజలకు చేరువ చేశారు.
కర్తవ్యమే మిన్న
ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ఎప్పుడూ కర్తవ్య నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారు. ప్రతిరోజూ వేకువనే నిద్ర లేచేవారు. పూజ అనంతరం వెంటనే విధుల్లో మునిగిపోయేవారు. దుర్గాపూజ వంటి సందర్భాల్లో సొంతూరు అయిన మిరాటీకి వెళ్లడం తప్ప ఆయన ఎప్పుడూ సెలవు తీసుకోవడం తెలీదని ఆయన కుమార్తె శర్మిష్ఠ చెబుతుంటారు.
పుస్తకాల పురుగు
ప్రణబ్ పుస్తకాలు బాగా చదివేవారు. ఒకేసారి వరుసపెట్టి 3 పుస్తకాలు చదివేసేవారు.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు.
అనుభవాలు గుదిగుచ్చి..
ఆయనకు డైరీ రాయడం అలవాటు. గత 40 ఏళ్లుగా ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాసేవారు. తన అనుభవాలన్నింటినీ భద్రపరచాలన్నది ఆయన సంకల్పం.
చేప లేనిదే ముద్ద దిగదు