గ్రామీణ ప్రాంతాల్లో.. మహిళల చేతుల్లో అట్ల కాడ, చీపురు కట్ట వంటి ఇంటి సామాన్లు, పొలం పనిముట్లు మాత్రమే కనిపిస్తాయి. అవే కాకుండా.. అవకాశం ఇస్తే ఏం చేయగలరో నిరూపించారు మధ్యప్రదేశ్ మండ్లాలోని గిరిజన మహిళలు. క్రికెట్ బ్యాట్ చేతబట్టి మైదానంలో అదరగొడుతున్నారు. ఎలాంటి క్రికెట్ వస్త్రధారణ లేకుండా సంప్రదాయ చీరల్లోనే రఫ్ఫాడిస్తున్నారు. సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ ప్రశంసలు పొందుతున్నారు.
ఇది వికాసమే..
సర్వాంగిణ్ మహిళా వికాస సమితి.. ఏటా పలు అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహిళా క్రికెట్ పోటీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు వనితలు. క్రికెట్ పరిభాషను పూర్తిగా అవగతం చేసుకుని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
మహిళలు వంటింటిని వదిలి, క్రికెట్ మైదానంలోకి దిగి తమ సామర్థ్యాన్ని తెలుసుకోవాలనేదే ఈ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశం. అన్ని రంగాల్లోను రాణించగలమన్న ఆత్మవిశ్వాసంతో, తమని తాము సంరక్షించుకోవాలంటున్నారు మహిళా సంఘం సభ్యులు.