లాక్డౌన్లోనూ ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలన్న సర్కారు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యలను అత్యవసర అంశంగా పరిగణించాలని కేంద్రానికి తెలిపింది సుప్రీంకోర్టు. మార్చి 29న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్.. అనేకమందిపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.
ఈ పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం. వ్యాజ్యాలపై స్పందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసి.. వచ్చే వారానికి విచారణను వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
కేంద్ర హోంశాఖ (మార్చి 29) ఆదేశాల స్థానంలో ఈ నెల 17న కేంద్రం మరో నోటిఫికేషన్ను విడుదల చేసిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అత్యుత్తమ న్యాయస్థానానికి తెలిపారు.
ఈ వ్యవహారాన్ని ఇప్పటికే ఈ నెల 15న విచారించింది సుప్రీంకోర్టు. లాక్డౌన్ వల్ల పని చేయని సంస్థలు.. తమ ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు అందించాలని ఆదేశాలివ్వడం వల్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని సుప్రీం అభిప్రాయపడింది. వాటికి కేంద్రం సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. లాక్డౌన్ కారణంగా చిన్న పరిశ్రమలు నడవలేకపోతుంటే.. ఇక సిబ్బందికి పూర్తి జీతాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించింది. ప్రభుత్వం సహాయం చేయకపోతే.. ఈ పరిశ్రమలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేవని అభిప్రాయపడింది.
ఎలాంటి అంశాలను పట్టించుకోకుండా, యజమానుల ఆర్థిక చిక్కులపై చర్చించకుండా.. కేంద్రం ఈ ఆదేశాలను జారీ చేసిందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) అసోసియేషన్ తన వ్యాజ్యంలో పేర్కొంది. పూర్తిస్థాయి జీతాలు అందిస్తే.. సంస్థను మూసుకోవాలని, దీని వల్ల మొత్తానికే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని చిన్న పరిశ్రమలు చెబుతున్నాయి.