కొవిడ్-19తో మృతి చెందిన ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ). వారి త్యాగాలను గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని కోరింది. కరోనా నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నంలో.. సొంత ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు.. యుద్ధభూమిలో మరణించిన అమరవీరులతో సమానంగా జాతీయ గౌరవం దక్కాలని పేర్కొంది.
అమర వైద్యుల కుటుంబాల కోసం ఇప్పటివరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదని తెలిపింది ఐఎంఏ. మరికొన్ని వారాల్లో భారతదేశం కరోనా కేసుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ సమయంలో ఆరోగ్య సిబ్బంది పాత్ర అత్యంక కీలకం కాబట్టే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొంది .
"అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ కావాలంటే వైద్యులు భయపడి ఇంట్లో కూర్చోవచ్చు. కానీ, అలా చేయలేదు. దేశానికి సేవ చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. కరోనాతో పోరాడుతూ మృత్యు ఒడిలోకి చేరిన వైద్యులపై ఆధారపడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైద్యుల జీవిత భాగస్వామి, లేద కుటుంబంలో ఒకరికి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి. "