తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్.. అత్యధికంగా దుబాయ్, యూకే ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి.. ఐఐటీ-మండి అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో కొవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే అయినట్లు తెలుస్తోంది.
తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్లో సామాజిక వ్యాప్తి జరగకుండా కొద్దిమేరకు అడ్డుకున్నారని.. అదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్, కర్ణాటకలోని కరోనా బాధితులు స్థానికంగా ప్రబలటానికి, అంతర్రాష్ట్ర వ్యాప్తికి కారణమయ్యారని ఈ అధ్యయనం తేల్చింది.
జనవరి-ఏప్రిల్ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. వైరస్ వ్యాపించిన మొదట్లో వచ్చిన ప్రాథమిక డేటా విశ్లేషించి ఐఐటీ మండి ఈ పరిశోధన నిర్వహించింది. ఇందులో అత్యధికంగా దుబాయ్, యూకే నుంచే అత్యధిక కేసులు వచ్చినట్లు గుర్తించారు.
మేము కొవిడ్-19 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది ? దేశంలో ఎలా జరిగింది ? అనే అంశాలను నిశితంగా పరిశీలించాం. కొంతమంది సూపర్ స్ర్పెడర్లు వైరస్ వ్యాప్తిలో కీలకంగా నిలిచారు. ఫేజ్-1లో అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా ఎలా ప్రబలిందనే అంశం ట్రావెల్ హిస్టరీ ఆధారంగా తెలుసుకున్నాం. వారి నుంచే స్థానికులకు ఎక్కువగా వైరస్ సోకింది.
-సరితా ఆజాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ మండి