'ఇకపై భిక్షాటన నై.. సెక్యూరిటీ ఉద్యోగానికి జై'
చీర, చేతికి గాజులు వేసుకుని దుకాణాల్లో చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసే రోజులు పోయాయి. తామూ గౌరవంగా జీవించే రోజులు వచ్చాయంటున్నారు ఒడిశా మల్కాన్గిరిలోని ఈ ట్రాన్స్జెండర్లు. చీరకు బదులు సెక్యూరిటీ గార్డ్ యూనిఫాం ధరించి దర్జాగా ఉద్యోగం చేస్తున్నారు. మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇన్నాళ్లు సమాజంలోనే ఉంటున్నా.. వెక్కిరించే కళ్లకు దూరంగా మరో ప్రపంచం ఏర్పాటు చేసుకుని బతికారు. కానీ, ఇప్పుడు వారూ సామాన్య మనుషులమేనని చాటుతున్నారు. భిక్షాటన మానేసి మల్కాన్గిరి జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించారు ఐదుగురు ట్రాన్స్జెండర్లు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ నెలకు రూ.6000 ఆర్జిస్తున్నారు.
ఆసుపత్రి గేటు వద్ద, లిఫ్టు వద్ద మాత్రమే కాదు.. ప్రసూతి గదులు వంటి అత్యవసర విభాగాల్లోనూ వీరు సేవలందిస్తున్నారు. వీరిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు మిగతా ట్రాన్స్జెండర్లు.