తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా? - ఎన్నికలు

"బలవంతపు పెళ్లి"... కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ పొత్తును ఉద్దేశించి ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శ. అందుకు తగినట్లే... వారి కాపురంలో కలహాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల రూపంలో కూటమికి కొత్త సవాలు ఎదురైంది. మరి ఏం జరుగుతుంది? ఒకప్పుడు శత్రువులైన క్షేత్రస్థాయి కార్యకర్తలు... ఇప్పుడు కలిసి పనిచేస్తారా? ఓట్ల బదిలీ సాధ్యమేనా?

కాంగ్రెస్​, జేడీఎస్​

By

Published : Mar 19, 2019, 9:48 AM IST

Updated : Mar 19, 2019, 8:38 PM IST

కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?

"2018 శాసనసభ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓడించింది జేడీఎస్సే. అందుకు కాంగ్రెస్​ నేతలు ప్రతీకారం తీర్చుకుంటారేమో! చాముండేశ్వరి స్థానం కలిసి ఉండే ఉత్తర బెంగళూరు లోక్​సభ నియోజకవర్గంలో మిత్రపక్షానికి సహకరించరేమో! అదే జరిగితే ఈ ఎన్నికల్లో జేడీఎస్​ అభ్యర్థి విజయం కష్టమే."

-ఓ జేడీఎస్​ నేత అనుమానం

ఈ అనుమానం జేడీఎస్​ది మాత్రమే కాదు. కాంగ్రెస్​ది కూడా. అందుకు కారణం.... వారి మధ్య పొత్తు కుదిరిన తీరు.

కర్ణాటకలో ఒకప్పుడు కాంగ్రెస్​, జనతాదళ్​(సెక్యూలర్​) వైరిపక్షాలు. 2018 శాసనసభ ఎన్నికల సమయంలోనూ అంతే. ఫలితం తర్వాత పరిస్థితి తారుమారైంది. భాజపాను నిలువరించేందుకు శత్రుత్వాన్ని పక్కనబెట్టాల్సి వచ్చింది. ఫలితం... కర్ణాటకలో అధికారం.

కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కన్నడ రాజకీయం సస్పెన్స్​ థ్రిల్లర్​ను తలపిస్తోంది. కాంగ్రెస్​ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగ ప్రసంగాలు, కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థుల ప్రయత్నాలు... ఇలా ఎన్నో మలుపులు. ఇప్పుడు కూటమికి అసలు సిసలైన అగ్నిపరీక్ష ఎదురైంది. అదే... సార్వత్రిక సమరం.

కర్ణాటకలో మొత్తం 28 లోక్​సభ నియోజకవర్గాలు. ఇందులో 20 చోట్ల పోటీచేస్తోంది కాంగ్రెస్​. మిగిలిన 8 సీట్లు జేడీఎస్​వి.

ఓట్ల బదిలీనే అసలు సమస్య

కర్ణాటకలో, ప్రత్యేకించి పాత మైసూరులో కాంగ్రెస్​-జేడీఎస్​ది దశాబ్దాల వైరం. ఇప్పుడు ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం ఎంతో కష్టం.
జేడీఎస్​ పోటీచేస్తున్న 8 స్థానాల్లో ప్రస్తుతం మాండ్య, హాసన్​లో మాత్రమే ఆ పార్టీ సిట్టింగ్​ ఎంపీలున్నారు. తుముకూరు కాంగ్రెస్​ ఖాతాలో ఉంది. మిగిలిన 5 భాజపావి. అంటే... ఎనిమిదింట 6 చోట్ల జేడీఎస్​కు కాంగ్రెస్​ మద్దతు ఎంతో అవసరం. మాజీ మంత్రి అంబరీశ్​ భార్య, సినీ నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మాండ్యలో సహకారం అనివార్యం. మైసూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణం వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ విజయానికి జేడీఎస్​ తోడ్పాటు ఎంతో కీలకం.

కలిసి విజయతీరాలకు చేరేందుకు అగ్రనేతలు ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. తుముకూరు, ఉత్తర కన్నడ సీట్లను కాంగ్రెస్​కు ఇవ్వడంపై జేడీఎస్​ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. అవసరమైతే తిరుగుబాటు అభ్యర్థుల్ని పోటీకి దింపుతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్​లోనూ దాదాపు అదే పరిస్థితి. ఇదే.. కూటమికి సవాలుగా మారింది.

"ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మేము కాంగ్రెస్​పై పోరాడుతూ వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్​ కార్యకర్తలు మా అభ్యర్థికి మద్దతివ్వడం, మావాళ్లు కాంగ్రెస్​ అభ్యర్థికి అండగా ఉండడం ఇబ్బందికరమే.
అయితే... ఇది రాష్ట్ర స్థాయి లేదా స్థానిక ఎన్నిక కాదు. లోక్​సభ ఎన్నిక. దిల్లీ చాలా దూరం. కాబట్టి పార్టీ శ్రేణులు కాంగ్రెస్​ అభ్యర్థా, జేడీఎస్​ అభ్యర్థా అనే విషయం పెద్దగా పట్టించుకోరు. కలిసి పనిచేస్తారు."
--వైఎస్​వీ దత్తా, జేడీఎస్​ ప్రచార కమిటీ సారథి

"కూటమిలో నమ్మకమే కీలకం. ఇప్పుడంతా ప్రారంభ దశలోనే ఉంది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. క్రమంగా 2 పార్టీల కార్యకర్తలు సర్దుకుపోతారు."
--రామలింగా రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

"పాత మైసూరులో కాంగ్రెస్​-జేడీఎస్​ బంధం అనివార్యత వల్ల ఏర్పడింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓట్ల బదిలీపై ఇప్పుడే ఏమీ చెప్పలేము. అభ్యర్థులను బట్టి ఫలితం ఉంటుంది."
--నారాయణ, అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం ఆచార్యుడు

కర్ణాటకలోని 28 లోక్​సభ నియోజకవర్గాలకు 2 దశల్లో ఏప్రిల్​ 18, 23న పోలింగ్​ జరగనుంది.

Last Updated : Mar 19, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details