ముహూర్తం కోసం నీళ్ల రైలుకు రెడ్ సిగ్నల్! చెన్నై నగర ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైలు ట్యాంకర్ వెల్లూరు నుంచి రాజధానికి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు నీటి రైలుకు స్వాగతం పలికారు.
50 ట్యాంకర్లున్న ఈ రైలు 25లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయగలదు. నీటి కొరత తగ్గుముఖం పట్టే వరకూ ఈ రైలు ట్యాంకరు సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ముహూర్తం కోసం రైలు ఆలస్యం..
రైలు ట్యాంకర్ చెన్నైకు ముందుగానే చేరుకోవాల్సి ఉన్నా మంత్రులు స్వాగతం పలికే ముహూర్తం కారణంగా ఆలస్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు చెప్పిన సమయానికే రైలు వచ్చిందని మంత్రి వేలుమణి వివరణ ఇచ్చారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంట్లను ఏర్పాటు చేసింది.