సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని నెలలుగా సాగుతున్న రైతుల శాంతియుత నిరసనలు హింసాయుతంగా మారాయి. గణతంత్ర దినోత్సవం వేళ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్దేశిత సమయం, నిర్దేశిత మార్గాలు, ఆచారించాల్సిన నిబంధనలను పక్కనపెట్టిన రైతులు.. మధ్య దిల్లీలో కదం తొక్కారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఈ పరిణామాలు ఇరువురి మధ్య ఘర్షణకు దారితీశాయి.
ఎర్రకోటపై రైతు జెండా..
నిర్దేశిత మార్గాన్ని పక్కనపెట్టిన వందలాదిమంది రైతులు.. ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. అనంతరం చారిత్రక కట్టడం మీద దేశ ప్రధాని ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ జెండాను ఎగురవేసే వేదికను ముట్టడించారు. అనంతరం పైకి ఎక్కి తమ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది జరిగిన కొద్దిసేపటికి పోలీసులు ఎర్రకోటకు చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
బస్సు దగ్ధం..
మంగళవారం ఉదయం నుంచే దిల్లీ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింఘు, టిక్రి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత నిర్ణీత సమయానికి ముందే సరిహద్దుల నుంచి రైతులు అన్నదాతలు ర్యాలీకి బయలుదేరారు. కొద్దిసేపటికి.. పలువురు తమ ట్రాక్టర్లతో నిర్దేశిత మార్గాల నుంచి తప్పించి మధ్య దిల్లీవైపు దూసుకెళ్లారు.
ఈ తరుణంలో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా ఐటీఓ ప్రాంగణం ఓ యుద్ధభూమిని తలపించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు రైతులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ రైతు మరణించాడు. పోలీసుల తూటా తగిలే అతడు చనిపోయాడని కర్షకులు చెబుతుండగా... ట్రాక్టర్ బోల్తాపడి, తలకు గాయమై మరణించాడని పోలీసులు అంటున్నారు.