తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో నిజాముద్దీన్ కల్లోలం- కరోనా కేసులు పెరుగుతాయా? - CORONA VIRUS PRECAUTIONS

నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న కొంతమంది కరోనా కారణంగా మరణించటం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ మహమ్మారి మరెంత మందికి సంక్రమించిందనే భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమయిన అధికారులు.. ప్రార్థనలకు హాజరైనవారితో పాటు వారు తిరిగిన ప్రదేశాలపైనా దృష్టి సారించారు.

VIRUS-TABLIGHi
దేశంలో నిజాముద్దీన్ కల్లోలం

By

Published : Mar 31, 2020, 6:48 PM IST

లాక్​డౌన్​తో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయనుకున్న తరుణంలో దిల్లీ నిజాముద్దీన్ పరిణామం దేశాన్ని కుదిపేస్తోంది. హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగ్ ఈ జమాత్ నిర్వహించిన సమావేశంలో 2 వేలమంది పాల్గొనటం కలవరం కలిగిస్తోంది.

ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు తెలంగాణవాసులు మరణించినట్లు నిన్న ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా మళ్లీ దేశం ఉలిక్కిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

దేశం నలుమూలల నుంచి..

ఇక్కడి మత ప్రార్థనలకు దేశ నలుమూలల నుంచి ప్రజలు రాగా.. విదేశాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. వీళ్లందరితోపాటు వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. వాళ్లు తిరిగిన ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే చాలా మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. సోమవారం ఒక్కరోజే దేశంలో 200కుపైగా కేసులు నమోదయ్యాయి.

ఒక్కరి నుంచి అనేక మందికి..

ఈ ప్రార్థనలకు హాజరైన జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లోని ఓ వ్యాపారవేత్త కరోనా కారణంగా గురువారం మరణించాడు. అతను దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్ కు రోడ్డు, రైలు, వాయు మార్గంలో ప్రయాణించి తిరిగి కశ్మీర్ చేరుకున్నాడు. 19 రోజుల తర్వాత అతను శ్రీనగర్ లోని నేషనల్ ఆసుపత్రిలో కన్నుముశాడు.

ఈ సమయంలో అతని ద్వారా చాలా మందికి వైరస్ సంక్రమించి ఉంటుందనే భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యాపారవేత్త కారణంగా సుమారు 300 మందిని క్వారంటైన్ చేశారు.

అతని ప్రయాణాలను గమనిస్తే..

తొలుత మార్చి 7న శ్రీనగర్ నుంచి దిల్లీకి విమానంలో ప్రయాణించాడు. అక్కడ తబ్లిగ్ ఈ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నాడు. ఇక్కడ పాల్గొన్న 2 వేల మందిలో 24 మంది నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు.

అనంతరం మార్చి 9న దిల్లీ నుంచి దేవ్ బంద్ కు రైలులో స్లీపర్ కోచ్ లో వెళ్లాడు. అక్కడ దారుల్ ఉలూమ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రెండు రోజుల తర్వాత మార్చి 11న రైలులో జమ్ము చేరుకున్నాడు. ఈ సమయంలో అతనితో ప్రయాణించినవారి వివరాలు సేకరించిన అధికారులు.. వారిని క్వారంటైన్ కు తరలించారు.

అనంతరం స్నేహితుడితో కలిసి..

జమ్ములో ఆ వ్యాపార వేత్త అతని స్నేహితుడైన వైద్యునితో కలిసి సాంబాలోని ఓ మసీదులో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇద్దరు కలిసి మార్చి 16 వరకు జమ్ము సమీపంలోని బారి బ్రహ్మన్నలోని ఓ లాడ్జిలో బస చేశారు. ప్రస్తుతం ఆ వైద్యుడు జమ్ములోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలోని 45 మందిని క్వారంటైన్ కు తరలించారు.

లక్షణాలు ఉన్నా..

మార్చి 16న కరోనా లక్షణాలు బయట పడినప్పటికీ విమానంలో శ్రీనగర్ నుంచి సోపోర్ కు వెళ్లాడు ఆ వ్యాపారి. రెండు రోజుల తర్వాత తిరిగి శ్రీనగర్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. మార్చి 21న ఛాతి నొప్పి, సాధారణ ఫ్లూ లక్షణాలతో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అనంతరం అతనిని సౌరాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి జమ్ములోని ఆసుపత్రిలో చేర్చగా కొద్ది రోజులకు మృతి చెందాడు.

ఇతని మరణంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతను వెళ్లిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తులకు సంబంధించి ఆరా తీశారు. బందిపొరా జిల్లాలో కనీసం నలుగురికి వైరస్ అంటించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అతనితోపాటు విమానాల్లో ప్రయాణించిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అతడ్ని పరీక్షించిన ఇద్దరు వైద్యులను కూడా నిర్బంధంలో ఉంచారు.

అధికారులు అప్రమత్తం..

ఇలా ఒక్కరి కారణంగా అనేక మందికి కరోనా సోకవచ్చన్న కారణాలతో అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. దేశంలో లాక్​డౌన్ విధించిన తర్వాత కూడా మర్కజ్ భవనంలో చాలా మంది ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్ కు పంపిస్తున్నారు అధికారులు. తబ్లిగ్ ఈ జమాత్ ప్రార్థనలకు హాజరైన వందలాది మందిని కూడా క్వారంటైన్​కు పంపి పరీక్షలు చేస్తున్నారు.

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారంతా చౌక ప్రయాణాలు చేస్తారు. ఫలితంగా ఎక్కువమందికి వైరస్ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరవుతారు. ఇప్పటికే నిజాముద్దీన్​లో 700 మందిని క్వారంటైన్​కు పంపగా.. 335 మంది ఆసుపత్రుల్లో చేరారని దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనాపై పోరు: కేంద్రానికి సుప్రీం 24 గంటల గడువు

ABOUT THE AUTHOR

...view details