భద్రతా కారణాల దృష్ట్యా జమ్ముకశ్మీర్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల్లోగా యాత్రికులు, పర్యటకులు సొంత ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
22వేల మంది పర్యటకులు
స్వస్థలాలకు చేరుకునే యాత్రికులు, ప్రయాణికుల సౌకర్యం కోసం విమాన, బస్సు సర్వీసులను పెంచింది ప్రభుత్వం. శుక్రవారం దాదాపు 22వేల మంది పర్యటకులు కశ్మీర్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
అయితే... హఠాత్తుగా నిర్ణయం తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు యాత్రికులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం, సహాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"హైదరాబాద్ నుంచి 10మంది వచ్చాము. అమర్నాథ్ యాత్రను రద్దు చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చాము. చాలా డబ్బు ఖర్చు అయింది. యాత్రలో పాల్గొనకుండానే తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. రెండు నెలల ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకున్నాం. ఆగస్టు 10న తిరిగి వెళ్లాలి. అప్పటివరకు మేం ఇక్కడ ఏం చెయ్యాలి? ఈ సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు."
-హైదరాబాద్ నుంచి వచ్చిన యాత్రికుడు.
"ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు. యాత్రను ఎందుకు రద్దు చేశారో తెలియదు. యాత్రను రద్దు చేయాల్సిన అవసరమేముంది? కొండపై బాబా ఉన్నాడు. పర్యటకులకు రక్షణ కల్పించడానికి సైన్యం ఉంది."
-రమేశ్ కుమార్, అమర్నాథ్ యాత్రికుడు.