తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నందన్​వన్​ జంగిల్​ సఫారీ.. వెళ్లాలోసారి.. - forest

ఛత్తీస్​గఢ్​ రాయ్‌పుర్ సమీపంలోని నందన్‌వన్ జంగిల్ సఫారీ... పర్యటకుల మనసుల్లో ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకుంటోంది. ప్రారంభమైన అనతికాలంలోనే సందర్శించి తీరాల్సిన పర్యటక ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. అడవుల్లో విహరించాలనే కోరికను నందన్‌వన్‌ జంగిల్ సఫారీ తీరుస్తోందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నందన్​వన్​ జంగిల్​ సఫారీ.. వెళ్లాలోసారి..

By

Published : Aug 2, 2019, 7:33 AM IST

నందన్​వన్​ జంగిల్​ సఫారీ.. వెళ్లాలోసారి..

దేశంలోని ప్రతి రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి. పర్యటకుల కోసం సరికొత్త ప్యాకేజీలతో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రజల సందర్శనార్థం అక్కడ బోన్లలో బంధించిన జంతువులను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అంతగా ఇష్టపడరు.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల్లో మాత్రమే సహజ సిద్ధమైన వాతావరణంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. అలాంటి చోటుకు వెళ్లేందుకు పర్యటకులు ఎంతో ఆస‌క్తి చూపిస్తుంటారు. అన్ని వయస్సుల వారికి మానసికోల్లాసాన్ని కలిగిస్తూ.. సరిగ్గా అలాంటి అనుభూతినే కలిపిస్తూ ఆకట్టుకుంటోంది నయా రాయ్‌పుర్‌లోని మానవ నిర్మిత నందన్‌వన్ జంగిల్ సఫారీ.

స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులను పర్యటకులకు దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పిస్తోందీ ఆసియాలోనే అతిపెద్ద నిర్మిత అడవిగా చరితత్రకెక్కిన జంగిల్ సఫారీ. ఇదే కారణంతో దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు, పర్యటకులు ఇక్కడికి తరలివస్తుంటారు. దట్టంగా పెరిగిన చెట్ల నుంచి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ.. అన్ని రకాల జంతువులను చూస్తూ ఆనందంగా గడుపుతుంటారు.

పర్యటకుల స్పందనలు..

''మొత్తం తిరిగాను. చాలా బాగా అనిపించింది. అన్నీ బయటే కనిపిస్తున్నాయి. మా దగ్గర జూ లాంటివి ఉన్నాయి కానీ వాటిలో జంతువులన్నీ బోన్లలో ఉంటాయి. ఇక్కడ దొరికిన అనుభూతి అక్కడ దొరకదు.''

''అన్నింటినీ బయటే ప్రత్యక్షంగా చూసినందున మా దగ్గర కంటే ఇక్కడ చాలా విభిన్నంగా అనిపించింది. సింహం, పులి, జింక, ఎలుగుబంటిను కూడా చూశాను.''

''సింహాన్ని కూడా చూశాం. అన్నింటికంటే ముందు ఎలుగుబంటిని చూశాం. అక్కడ పులి కూడా ఉంది. ప్రత్యక్షంగా చూసినందున చాలా బాగా అనిపించింది.''

''మా కుటుంబంతో కలిసి ఇక్కడకు నేను మొదటిసారి వచ్చాను. ముందుగా మేం హెర్బివోర్‌ సఫారీ చూశాం. అక్కడ 300కి పైగా వేరువేరు జాతులకు చెందిన జింకలున్నాయి. తర్వాత ఎలుగుబంటిని చూశాం. ఎలుగుబంట్లకు, పులులు, సింహాలకు కూడా వేర్వేరు సఫారీలున్నాయి. బహిరంగంగా ఉండడమే దీని ప్రత్యేకత. దీని నిర్వహణ చాలా బాగుంది.''
- సఫారీకి విచ్చేసిన పర్యటకులు.

వలస పక్షుల రాక....

నందన్‌వన్ జంగిల్ సఫారీలోని కండువా జలాశయంలో పర్యటకులకు బోటింగ్ చేసే సదుపాయం కూడా కల్పించారు. 130 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జలాశయంలోకి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే వలస పక్షులు జంగిల్‌ సఫారీకి మరింత అందాన్ని, ప్రత్యేకతను తెస్తున్నాయి. పర్యటకులకు సురక్షిత బోటింగ్‌ పరిచయం చేస్తూ, జంతువుల దాహార్తిని తీరుస్తున్న ఈ జలాశయంలో నీరు ఏ మాత్రం కలుషితం కాకుండా.. స్వచ్ఛంగా ఉండడం సందర్శకులను మరింత ఆహ్లాదపరుస్తోంది.

''కండువా జలాశయంలోని నీరు పరిసరాల్లో మొక్కలు, చెట్లకు సరఫరా అవుతుంది. అడవిలో ఉన్న జంతువులకు కూడా ఈ జలాశయం చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు.''

''చాలా బాగుంది. చల్లగా స్వచ్ఛమైన గాలి వీస్తోంది. జంగిల్ సఫారీలో బాగా ఉల్లాసంగా గడిపాం. సింహం, పులిని చూశాం. చాలా బాగా అనిపిస్తోంది.''
''ఇక్కడికి వచ్చే పర్యటకులకు సహజసిద్ధమైన అనుభూతి కలిగించడమే ఈ అడవి వెనకున్న ఉద్దేశం. బహిరంగ ప్రదేశంలో జంతువులను స్వేచ్ఛగా వదిలేశాం. అందువల్ల పర్యటకులు సహజ అనుభూతి పొందుతారు.''
- పర్యటకులు

నందన్‌వన్ జంగిల్ సఫారీ నిర్వాహకులు పర్యటకుల కోసం వివిధ రకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. సరదాగా కాలక్షేపం కోసం ఖాళీ సమయాల్లోనే కాకుండా.. అవకాశం కల్పించుకొని మరీ కుటుంబ సమేతంగా ఈ జంగిల్​ సఫారీకి విచ్చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ప్రత్యేక అనుభూతికి లోనవుతూ ఆనందంగా సేదతీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details