దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ సగటు పాజిటివ్ రేటు తగ్గుతోందని ప్రకటించింది కేంద్రం. ఆగస్టు 3-9 మధ్య 9.67 శాతంగా ఉన్న రోజువారీ సగటు పాజిటివ్ రేటు.. గత వారంలో 7.67 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వరుసగా ఆరో రోజు రోజుకు 8 లక్షలకు పైగా నమూనాలు పరీక్షించినట్లు తెలిపింది.
" శనివారం 8,01,147 నమూనాలు పరీక్షించాం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,52,92,220 పరీక్షలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో పరీక్షా వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా టెస్టింగ్‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. పరీక్షల పెరుగుదలతో.. రోజువారీ సగటు పాజిటివ్ రేటు తగ్గుతోంది. ఇప్పటి వరకు మిలియన్ జనాభాకు పరీక్షల సంఖ్య 25,574కు చేరింది."
- కేంద్ర ఆరోగ్య శాఖ.
పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం ద్వారానే.. పాజిటివ్ కేసులను గుర్తించటం, వారితో కలిసిన వారిని సమయానికి ఐషోలేషన్‌కు పంపటం, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించటం సాధ్యమవుతుందని పేర్కొంది ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 983 ప్రభుత్వ, 532 ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పింది.
75 శాతానికి రికవరీ రేటు!
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,80,566కు చేరిన నేపథ్యంలో రికవరీ రేటు దాదాపు 75 శాతానికి పెరిగినట్లు తెలిపింది కేంద్రం. అలాగే మరణాల రేటు 1.86 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు రేటు అతితక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిని ఉద్ఘాటించింది. ప్రస్తుతం 23.24 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపింది ఆరోగ్య శాఖ.
ఇదీ చూడండి:'ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్'