దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని చాలా చోట్ల వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ముంబయి జస్లోక్ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు, 16 మంది నర్సులకు కరోనా సోకింది.
ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన ముగ్గురు కరోనా బాధితుల నుంచి వైద్య సిబ్బందికి వైరస్ సంక్రమించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరందిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మహా నగరంలోనే అధికం..
ఒక్క ముంబయిలో ఇప్పటికే 2,509 కేసులు నమోదు కాగా.. 125 మంది మరణించారు. 281 మంది కోలుకున్నారు. వీరికి చికిత్స అందించిన కేఈఎం ఆసుపత్రితోపాటు ఓక్హార్డ్, ఫోర్టిస్, సుశ్రుష, సైఫీ, సాయి తదితర ఆసుపత్రిల్లోనూ వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
దిల్లీలోనూ..
దిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్య కళాశాలలో ఇద్దరు వైద్యులు, ఆరుగురు నర్సులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వారిని అదే ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు.
దేశరాజధానిలో 1,893 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 42 మంది మరణించగా.. 72 మంది కోలుకున్నారు.
గుజరాత్లో భారీగా కేసులు..
గుజరాత్లో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 228 కేసులు నమోదుకాగా.. మొత్తం సంఖ్య 1,604కు పెరిగింది. కొత్త కేసుల్లో 140 అహ్మదాబాద్‌లోనే నమోదు కాగా.. ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,002కు చేరింది. గుజరాత్లో మొత్తం 58 మంది మరణించారు.
ఇండోర్‌లో తీవ్రంగా..
మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో 1,407 మంది కరోనా బాధితులు ఉండగా.. 70 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన ఇండోర్ జిల్లాలో 890 కేసులు నమోదు కాగా.. 49 మంది మరణించారు.
ఇదీ చూడండి:దేశంలో 500 దాటిన కరోనా మరణాలు