విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో చాలా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. దేశంలోని 15 ప్రాంతాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉందని కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) తెలిపింది. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు మరణించినట్లు వెల్లడించింది.
దేశంలోని వాయవ్య, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్లో మరో 5 రోజుల పాటు భారీ వానలు పడుతాయని తెలిపింది.
నదుల ఉగ్రరూపం..
గంగా, సట్లెజ్, రావి, బియాస్, యమున నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని హెచ్చరించింది. దక్షిణాన గోదావరి, కృష్ణా నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.