పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో డిసెంబరు 20న పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల సమయంలో మేరఠ్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) అఖిలేశ్ నారాయణ్ సింగ్ నిరసనకారులను హెచ్చరిస్తున్న ఓ వీడియో తాజాగా వైరల్ అయ్యింది. అందులో అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘మీకు ఈ దేశంలో ఉండాలని లేకపోతే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి. ఇక్కడ ఉంటూ మరో దేశాన్ని పొగుడుతారా? ఇక్కడేదైనా జరిగితే దానికి మీరే బాధ్యులు’ అని హెచ్చరించినట్లుగా ఉంది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో సదరు వ్యాఖ్యలపై స్పందించారు ఎస్పీ అఖిలేశ్. '‘కొందరు యువకులు పాకిస్థాన్‌ను అనుకూలంగా నినాదాలు చేశారు. అందుకే నేను అలా మాట్లాడా. మీకు భారత్ అంటే ద్వేషముంటే పాకిస్థాన్ వెళ్లిపొమ్మని చెప్పా’' అని తెలిపారు.