కేంద్రంపై కాంగ్రెస్ గరం... నేడే 'భారత్ బచావో' ర్యాలీ పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్న వేళ.. 'భారత్ బచావో' ర్యాలీని కాంగ్రెస్ నేడు నిర్వహించనుంది. 'భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు' ఈ ర్యాలీ చేపడుతున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఈ భారీ ర్యాలీకి దిల్లీలోని రాంలీలా మైదానం వేదికకానుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి...
నేటి ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది హస్తం పార్టీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులు శుక్రవారం... రాంలీలా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ భారీ ర్యాలీలో సుమారు 50 వేల మంది పాల్గొంటారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.
అదే సమయంలో ప్రపంచంలోని అనేక చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భాజపా అహంకార ధోరణి నుంచి భారత్‌ను రక్షించాలని డిమాండ్ చేయనున్నట్టు హస్తం పార్టీ పేర్కొంది.