పౌరసత్వ చట్టానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ భారీ కార్యక్రమం చేపట్టనుంది. జనవరి 5 నుంచి ఇంటింటికీ వెళ్లి పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని నిర్ణయించింది. భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా కీలక నేతలందరూ పాల్గొననున్నారు. 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. గాజియాబాద్‌లో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లఖ్‌నవూలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నాగ్‌పుర్‌లో నితిన్ గడ్కరీ, జైపుర్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా పౌరసత్వ అంశంపై ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైన్. పౌరసత్వ చట్టంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జైన్.