దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. కేసులతో పాటు రికవరీల సంఖ్య కూడా ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది.
తాజా గణాంకాల ప్రకారం దేశంలో గురువారం 87,472 మంది బాధితులు కోలుకున్నారని... దీంతో మొత్తం రికవరీల సంఖ్య 41,12,551కి చేరినట్లు వైద్య శాక తన నివేదికలో వెల్లడించింది. ఫలితంగా రికవరీ రేటు 78.86 శాతానికి చేరిందని తెలిపింది. ఇదే సమయంలో మరణాల శాతం 1.63కి తగ్గినట్లు స్పష్టం చేసింది. గత 11 రోజులుగా 70 వేలకుపైగా బాధితులు ప్రతి రోజు కోలుకుంటున్నట్లు పేర్కొంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీల సంఖ్య 4.04 రెట్లు అధికంగా ఉందని తెలిపింది.
వైద్య శాఖ గణాంకాలు
- యాక్టివ్ కేసుల్లో 59.8 శాతం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
- రికవరీల్లో 59.3 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి.
- కొత్తగా కోలుకుంటున్న వారిలో 90 శాతం.. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచే ఉన్నారు.
- కొత్తగా నమోదవుతున్న రికవరీల్లో మహారాష్ట్ర(22.31 శాతం), ఆంధ్రప్రదేశ్(12.24 శాతం), కర్ణాటక(8.3 శాతం), తమిళనాడు(6.31 శాతం), ఛత్తీస్గఢ్(6 శాతం) రాష్ట్రాలు ముందున్నాయి.