అయోధ్య రామ మందిర భూమి పూజకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 5న ప్రధాని మోదీ.. ప్రముఖ సాధువులు, ఇతర ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. 22.6 కిలోల వెండి ఇటుకతో ఆయన పునాది రాయి వేయనున్నారు. భూమి పూజ కోసం, ఆలయ నిర్మాణంలో ఉపయోగించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి భక్తులు మట్టిని, నదుల నుంచి పవిత్ర జలాలను పంపిస్తున్నారు. వీటి సేకరణలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఆలయ నిర్మాణ స్థలం, ఆలయం పేరు తదితర వివరాలను రాగి రేకుపై సంస్కృతంలో చెక్కి దానిని శంకుస్థాపనలో ఉపయోగిస్తారు.
మూడున్నర సంవత్సరాలు
ఆలయ నిర్మాణం పూర్తికి 3.5 సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. ఈ మందిరం ప్రపంచంలోని పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా నిలిచిపోనుంది. ఆలయ పునాది 15 అడుగుల లోతు నుంచి వేయనున్నారు. మందిరం ఎత్తును గతంలో 141 అడుగులుగా ప్రతిపాదించగా ఇప్పుడు 161 అడుగులకు పెంచారు. ఆలయంలో భక్తులు ప్రశాంతంగా కూర్చొని దేవుడిని ప్రార్థించుకోవడానికి ఏర్పాట్లుంటాయి. సాధువుల సలహాలను అనుసరించి ఆలయంలో హనుమంతుడు, కృష్ణుడు తదితర దేవుళ్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. 67 ఎకరాల్లో రామాలయ ప్రాంగణం విస్తరించి ఉంటుంది. 2.77 ఎకరాల్లో ప్రధాన ఆలయం ఉంటుంది. మిగతా భూమిలో ఇతర దేవుళ్లు, దేవతల మందిరాలను ఏర్పాటు చేయడంతో పాటు రామాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తారు. గోశాల, ధర్మశాల తదితర నిర్మాణాలనూ ఈ ఆవరణలో చేపడతారు. ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించరు.
ఇవీ విశేషాలు
నక్షత్రవాటిక
27 నక్షత్రాలకు సూచికగా ఆలయ ప్రాంగణంలో 27 మొక్కలను నాటుతారు. భక్తులు తమ తమ జన్మనక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం, దేవుడిని ప్రార్థించుకోవడం ఈ నక్షత్రవాటిక ఏర్పాటు ఉద్దేశం. వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన వివిధ వృక్ష జాతులనూ నాటుతారు.