మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శ్రద్ధాంజలి ఘటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా.. దేశం మొత్తం భారతమాత ముద్దుబిడ్డను గుర్తు చేసుకుంటోందని పేర్కొన్నారు. కీలకమైన దశలో భారత్కు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. ఆయన గొప్ప రాజకీయ నేత, పండితుడని కొనియాడారు.
" ఈ రోజు దేశం మొత్తం మాజీ ప్రధానమంత్రికి నివాళులర్పిస్తోంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన నాయకత్వం వహించారు. ఈ రోజు పీవీ నరసింహారావుజీ శతజయంతి. ఆయన బహుభాషా కోవిదుడు. భారత్లోని అత్యంత అనుభజ్ఞులైన నాయకులలో పీవీ ఒకరు. స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన చిన్న తనం నుంచే అన్యాయంపై పోరాటం చేశారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆయన జీవితవిశేషాల గురించి ప్రతి ఒక్కరు పూర్తిగా, లోతైన అధ్యయనం చేసి తెలుసుకోవాలని కోరుతున్నా. మారోమారు ఆయనకు నా నివాళి. "