తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: సీఎంలతో నేడు ప్రధాని భేటీ

ప్రస్తుత కరోనా కాలంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేడు మరోసారి సీఎంలతో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందని ప్రధాని కార్యాలయం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. వైరస్​పై అవలంబించాల్సిన విధానంపై ఈ భేటీలో చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశం రెండు విడతలుగా జరగుతుందని సమాచారం.

modi
ఆపరేషన్​ కరోనా: సీఎంలతో నేడు మోదీ భేటీ

By

Published : May 11, 2020, 5:46 AM IST

Updated : May 11, 2020, 6:51 AM IST

కరోనా వేళ.. దేశ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం జరగనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలవుతున్న విధానాన్ని సమీక్షించనున్నారు ప్రధాని. మే 17తో లాక్​డౌన్​ గడువు తీరనున్న నేపథ్యంలో.. తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన విధానాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

లాక్​డౌన్​ ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం వంటి వ్యూహాలపైనా సీఎంలతో చర్చించనున్నట్లు సమాచారం.

ఈసారి భేటీకి కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది. గత సమావేశంలో కొంతమంది సీఎంలకే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రధాని.. ఈసారి అందరినీ మాట్లాడాలని కోరినట్లు సమాచారం.

కరోనా దృష్ట్యా.. దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్​డౌన్​ అమల్లో ఉంది. అనంతరం.. వైరస్​ తీవ్రతను బట్టి ఇప్పటికి రెండు సార్లు లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం.

రెండు దఫాలుగా..

సీఎంలతో రెండు విడతలుగా ప్రధాని మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తొలి విడత మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగేందుకు అవకాశం ఉంది. సాయంత్రం 6 నుంచి రెండో విడత వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతోందని తెలుస్తోంది.

ఐదోసారి...

దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ భేటీ కావడం ఇది ఐదోసారి. జనతా కర్ఫ్యూ విధించే ముందు మార్చి 22న తొలిసారి సీఎంలతో మాట్లాడారు ప్రధాని. తర్వాత వేర్వేరు సందర్భాల్లో లాక్​డౌన్​ పొడిగింపునకు... ముఖ్యమంత్రుల అభిప్రాయాలు కోరేందుకు పలుమార్లు వీడియోకాన్ఫరెన్స్​లు నిర్వహించారు. ఏప్రిల్​ 27న చివరిసారిగా సమావేశమయ్యారు.

ఇదీ చూడండి:దిల్లీలోనూ 'దొంగ కరోనా' కేసులు- 75% అవే!

Last Updated : May 11, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details