జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తామన్నారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన అప్నీ పార్టీ అధినేత అల్తఫ్ బుకారీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధులు ఆదివారం అమిత్ షాను కలిశారు. అంతకు ముందు రోజే వారు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
కశ్మీర్ అభివృద్ధి మన కళ్లముందే..
జమ్ము కశ్మీర్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని అమిత్ షా అన్నారు. డెమోగ్రఫిక్ మార్పులకు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలతో కలిసి పనిచేసి త్వరలోనే జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తుందని.. అమిత్ షా అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.