తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి - తరచూ చేతులు శుభ్రపరచుకోవడం

చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు మన దేశంలోనూ అడుగుమోపింది. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎలాంటి వారికి ఈ వైరస్​ సోకుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై విశ్లేషించారు. అవేంటో తెలుసుకుందాం.

To reduce corona virus
కరోనా దెబ్బకు హ్యాండ్​ 'షేక్'- ఈ జాగ్రత్తలు తప్పనిసరి

By

Published : Mar 13, 2020, 9:27 PM IST

Updated : Mar 13, 2020, 10:08 PM IST

కరోనా వైరస్‌ మన గడపదాకా వచ్చిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమంటున్నారు. వైరస్‌ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేననీ మృతుల్లోనూ 40% మందికిపైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారని చెబుతున్నారు.

మాస్కులు ధరించడం

వైద్య నిపుణుల సూచనలివే..

  • వైరస్‌ నేరుగా మన శరీరంలోని ఏదో ఒక భాగంపై ప్రభావం చూపుతుందని చెప్పలేం. కరోనా వైరస్‌ విషం కాదు... కాబట్టి సోకినవారు తక్షణం చనిపోరు. చైనాలో చాలామంది కోలుకుంటున్నారు. ఇది ఎవరికైనా సోకితే 14 రోజుల్లోపు బయట పడుతుంది. లేదంటే ఏమీ లేదన్నట్లే లెక్క.
  • కరోనా వైరస్‌ వ్యాప్తి చెందాలంటే ఏదైనా వాహకం ఉండాలి. లేకపోతే బతకలేదు. ఉదాహరణకు ఒక వస్తువుకు వైరస్‌ అంటుకుంటే... దాన్ని మరొకరు ఎవ్వరూ తాకకుంటే అది 3-5 రోజులకు చచ్చిపోతుంది. అంటే కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులను వెంటనే ఇతరులు ఉపయోగిస్తే... అది సోకడానికి అవకాశం ఉంటుంది.
  • వైరస్‌ మన చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. అయితే ఆ చేతులతో కళ్లు, ముక్కును నలుముకుంటే అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ ప్రధానంగా శరీరంలోకి చొరబడేది కళ్లు, ముక్కు ద్వారానే. అందుకే ముక్కుకు మాస్క్‌ పెట్టుకోవడం అత్యవసరం.
  • నిజానికి మనుషులను చంపే శక్తి ఈ వైరస్‌కు లేదు. అప్పటికే వారికున్న ఇతర సమస్యల కారణంగానే మరణాలు సంభవిస్తాయి. ఉదాహరణకు కరోనా సోకిన 60 ఏళ్ల వ్యక్తికి ఇప్పటికే అతిసారముంటే అది తగ్గదు. ఒకవేళ మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుంటే ఈ వైరస్‌తో మరణం సంభవించే అవకాశమే ఉండదు.

కరచాలనం చాలిద్దాం - కరోనాను ఓడిద్దాం

శుభ్రంగా ఉంటే సుబ్బరంగా బతికేయవచ్చని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే వారు ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను సైతం ప్రజలు ‘చేతులు జోడించి’ దూరంగా నెట్టేయవచ్చని వైద్యులూ స్పష్టం చేస్తున్నారు. కరచాలనం చేయకుంటేనే మంచిదంటున్నారు. నివారణ చర్యలు, జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం అత్యంత అవసరమన్నారు. కరోనాపై భయాందోళనలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో దీని గురించిన వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిల్లీలోని పలువురు వైద్య నిపుణులతో ‘ఈనాడు’ మాట్లాడింది...

చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులతో వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుందా?

చైనా నుంచి షిప్‌మెంట్లు మన దేశానికి రావడానికి 20రోజులు పడుతుంది. అందువల్ల అక్కడి నుంచి వచ్చే వస్తువులు, సెల్‌ఫోన్ల ద్వారా ఈ వైరస్‌ విస్తరిస్తుందని చెప్పడానికి ఆధారాల్లేవు. అక్కడ వస్తువులను ఒకసారి లోడ్‌ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేంతవరకు వాటిని ఎవ్వరూ తాకే అవకాశమే ఉండదు. దిగుమతుల ద్వారా వైరస్‌ వచ్చినట్లు ఇంతవరకు ఒక్క ఆధారమూ లభించలేదు. సమాచారలోపంతోనే ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దిగుమతి చేసుకొనే వస్తువుల నుంచి ఇది సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్యాకింగ్‌ సామగ్రి, పుస్తకాలు, ఇతర వస్తువుల ద్వారా ఇది విస్తరించదని స్పష్టం చేసింది. ఒకవేళ వైరస్‌ సోకిన మాంసం లాంటి జీవకణజాలం ఉన్న వస్తువులను దిగుమతి చేసుకుంటే అందులో వైరస్‌ ఉండటానికి వీలుంటుంది.

అధిక వేడిపై వండే మాంసంలో వైరస్‌ ఉంటుందా?

  • చికెన్‌, మటన్‌లను మనం అధిక ఉష్ణోగ్రతల్లో వండుతాం. అప్పుడు వాటికి అంటుకున్న వైరస్‌ కచ్చితంగా చనిపోతుంది. అయితే వండటానికి ముందు ముక్కలుగా కోసేటప్పుడు అందులోని వైరస్‌ మన చేతులకు అంటుకుంటుంది. అవే చేతులతో మనం కళ్లు, ముక్కులను నులుముకుంటే వైరస్‌ సోకే ప్రమాదముంది.
  • ఇక్కడ తినడం కంటే తాకడం వల్లనే వైరస్‌ విస్తరిస్తుంది. కరోనా వైరస్‌ విస్తరణకు ముఖమే అత్యంత అనువైంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖాన్ని చేతులతో తడుము కోవడం, తుడుచుకోవడం లాంటివి చేయకూడదు. శుభ్రమైన గుడ్డ, న్యాప్కిన్లను వాడాలి. తర్వాత వాటిని మూతలున్న చెత్తబుట్టల్లో పడేయాలి.

దీనికి నివారణ మార్గం ఏంటి? మన ఆర్థిక రంగంపై దీని ప్రభావం ఎంత?

ఈ వైరస్‌ నివారణకు టీకాల అభివృద్ధిపై కసరత్తు జరుగుతోంది. చైనా ఇప్పటికే ‘ఫవిలవిర్‌’ అనే మందుకు ఆమోదముద్ర వేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. మనం బల్క్‌ డ్రగ్స్‌, ఇతర అంశాల్లో చైనాపై ఎక్కువ ఆధారపడ్డాం. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బల్క్‌ డ్రగ్స్‌ ద్వారా వైరస్‌ విస్తరించదు. అందులోని రసాయనాల కారణంగా వైరస్‌ వృద్ధి చెందదు. ఇంట్లోని ఉప్పునకు బూజు పట్టనట్లుగానే రసాయనాలు ఉండే మందులకూ వైరస్‌ సోకదు.

కరోనా వైరస్‌ ఇదివరకే జంతువుల్లో ఉంది కదా? ఇప్పుడు ఎందుకింత భయాందోళనలు ప్రబలాయి?

కరోనా కొత్తదేమీ కాదు. ఇదివరకే జంతువుల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందులో జన్యుమార్పులు జరిగినట్లు అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) చెబుతోంది. ఇందులో నిజం ఎంతుందన్నది మనకు తెలియదు. ఇప్పుడు దీన్నుంచి తప్పించుకోవాలంటే చేతులకు తొడుగులు, ముక్కుకు మాస్క్‌ ఉపయోగించడం మంచిది. దీనికి చికిత్స, టీకా లేదు.

ఆహారం.. ఇతర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • కరోనా వైరస్‌ను తప్పించుకోవడానికి సబ్బులు, ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌ వాడితే బాగుంటుంది. అలాంటివి లేకపోయినా కనీసం నీళ్లతో గంటలకోసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
  • వైరస్‌ సోకిన తిండి తిన్నా ఏమీ కాదు. ఎందుకంటే కడుపులో ఉండే ఆమ్లాలు(యాసిడ్లు) దాన్ని చంపేస్తాయి. నోట్లోంచి తీసుకొనే పదార్థాల కంటే కళ్లు, ముక్కు నులుముకోవడంతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి.

ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశముందా?

మనుషులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే గాలి ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని కొందరు అంటున్నారు. గాలి ద్వారా వ్యాపించే లక్షణాలు దీనికి ఉన్నాయా? లేదా? అన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే... బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటం మేలు.

తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతులు లేదా రుమాలు అడ్డు పెట్టుకోవడం

ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

  • ప్రస్తుతానికి కొన్ని రోజులు కరచాలనం చేయకపోవడమే మంచిది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ‘నమస్తే’ అంటూ చేతులు జోడించడం మేలు.
  • చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు, కళ్లను, ముక్కును నులుముకోవద్దు. మాస్కులు ధరించాలి.
  • ఈ విషయాలను ఎవరికివారుగా ఇతరులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలి.
    తరచూ చేతులు శుభ్రపరచుకోవడం

ఇదీ చదవండి:కరోనా వస్తే ఏం చేయాలి? వ్యాధి లక్షణాలేంటి?

Last Updated : Mar 13, 2020, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details