నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిరసనలకు భాజపా కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇందుకోసం పంజాబ్లో అక్టోబర్ 13-20 వరకు 8 మంది కేంద్ర మంత్రులు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ పర్యటనలో రైతులు, వ్యవసాయ పరిశోధకులు, రైతు సంఘాల నేతలతో మంత్రులు మాట్లాడి, చట్టాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టాలపై వారి సందేహాలను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్, జితేంద్రసింగ్, కైలాశ్ చౌదరి, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, సంజీవ్ బలియాన్, సోమ్ ప్రకాశ్ ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరంతా వేర్వేరుగా అమృత్సర్ నుంచి మొహాలీ వరకు పర్యటిస్తారు.