తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపాకు షాక్

పశ్చిమ బంగలో మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసింది అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ. కలియాగంజ్​, ఖరగ్​పుర్​, కరింపుర్​లో ప్రత్యర్థి భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఎన్​ఆర్​సీ అమలుపై ఏర్పడిన గందరగోళమే భాజపా ఓటమికి కారణమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

By

Published : Nov 28, 2019, 5:47 PM IST

TMC
బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపా షాక్

పశ్చిమ బంగలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు చోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చిత్తు చేస్తూ.. భారీ మెజారిటీతో క్లీన్​ స్వీప్​ చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్​.

భారీ మెజారిటీతో...

ఉప ఎన్నికల ఫలితాల్లో మొదట వెలువడిన కలియాగంజ్​ స్థానంలో టీఎంసీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి తపన్​ దేవ్​ సిన్హా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కమల్​ చంద్ర సర్కార్​పై 2,418 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

కరింపుర్​ స్థానంలో భాజపాపై సుమారు 24,073 ఓట్ల ఆధిక్యంతో టీఎంసీ అభ్యర్థి బిమలెందు సిన్హా గెలుపొందారు.

ఖరగ్​పుర్​ సరద్​ స్థానంలో భాజపా అభ్యర్థి ప్రదిప్​ సర్కార్​పై టీఎంసీ అభ్యర్థి ప్రేమచంద్ర ఝా సుమారు 20,788 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

భాజపా పట్టున్న స్థానాల్లోనూ..

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపొందిన రాయ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోనిదే కలియాగంజ్​. ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నప్పటికీ.. ఉప ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది భాజపా. గతంలో ఈ సీటు కాంగ్రెస్​ చేతిలో ఉండేది.

ఖరగ్​పుర్​ సదర్​ స్థానంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్​ ఘోష్​ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మెదినిపుర్​ స్థానం నుంచి లోక్​సభకు ఎన్నికవటం వల్ల ఖాళీ ఏర్పడింది. భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలోనూ టీఎంసీ విజయం సాధించటం ఆ పార్టీకి మింగుడుపడని విషయం.

కరింపుర్​ ఎమ్మెల్యే, టీఎంసీ నేత మోహువా మిత్రా లోక్​సభకు ఎన్నికైన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే .. ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది టీఎంసీ.

భాజపా అహంకారానికి సరైన సమాధానం: మమత

"అహంకార ధోరణితో రాష్ట్ర ప్రజలను అవమానించే భాజపాకు ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం" అని పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఉప ఎన్నికల విజయాన్ని బంగాల్​ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్​, సీపీఎం తమ పార్టీలను బలపర్చుకోవాల్సింది పోయి.. భాజపాకు వంతపాడుతున్నాయని ఆరోపించారు.

ఎన్​ఆర్​సీపై గందరగోళంతోనే..

బంగాల్​లో ఎన్​ఆర్​సీని అమలు చేసే అంశంపై ఏర్పడిన గందరగోళం కారణంగానే భాజపా ఓటమి చెందిందని పార్టీ తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉండదని విశ్లేషించారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్నవారే గెలుస్తారని చెప్పారు.

ఇదీ చూడండి: బంగాల్​ బరి: సెమీఫైనల్​పై మోదీ, దీదీ గురి!

ABOUT THE AUTHOR

...view details