బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా మధ్య మరోమారు మాటల యుద్ధం నెలకొంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను "విషపూరిత సర్పం"తో పోల్చడంపై భాజపా శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ సభ్యులు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అదుపులో పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
'ఆర్థికమంత్రి ఓ కాల నాగు'
పెరుగుతున్న ఇంధన ధరలు, రైల్వే ప్రైవేటీకరణకు నిరసనగా బంకురలో ర్యాలీ నిర్వహించారు కల్యాణ్ బెనర్జీ. ఈ నేపథ్యంలో నిర్మల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
"ప్రజలను కాటేసి, చంపే కాల నాగు లాగే.. ఆర్థికమంత్రి విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చంపేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆర్థికమంత్రి మన దేశంలో ఉన్నారు. నిర్మల వెంటనే రాజీనామా చేయాలి."
-- కల్యాణ్ బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు చేశారు కల్యాణ్. నూతన భారతాన్ని సృష్టిస్తానని వాగ్దానం చేసిన మోదీ.. దేశ జీడీపీ వృద్ధి రేటును అమాంతం తగ్గించి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
'అవన్నీ అర్థం లేని మాటలు...'