తృణమూల్, భాజపా మధ్య మాటల యుద్దం తీవ్రమైంది. వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి రాకుండా బంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిష్ షా చేసిన ఆరోపణలను ఖండించింది మమతా బెనర్జీ సర్కార్. లాక్డౌన్ వంటి క్లిష్ట సమయంలో హోంమంత్రి విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోయారని టీఎంసీ నేత, మమత మేనల్లుడు అభిశేక్ బెనర్జీ ధ్వజమెత్తారు. కొన్ని వారాల తర్వాత నోరు తెరిచిన షా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. బంగాల్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.
మమతను చూసి ఓర్వేలేకే కేంద్రం ఆమెను లక్ష్యంగా చేసుకుని లేనిపోని ఆరోపణలు చేస్తోందని టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి 8 రైళ్లు కార్మికులతో బంగాల్ చేరుకున్నాయని తెలిపారు. కేంద్రం అబద్ధాలు చెబుతోందని, సీఎం మమతా బెనర్జీని విమర్శించే హక్కు లేదన్నారు. మహారాష్ట్రలో 16 మంది వలస కార్మికుల మృతికి రైల్వే శాఖ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు 6000 మంది కార్మికులు బంగాల్ చేరుకున్నారని, పంజాబ్, కేరళ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి మరో 10రైళ్లలో ఇంకా వస్తారని దీదీ సర్కార్ తెలిపింది.