బంగాల్లో హింసకు తృణమూల్ కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. మంగళవారం కోల్కతాలో రోడ్ షో నిర్వహిస్తుండగా జరిగిన ఘర్షణలో సీఆర్పీఎఫ్ రక్షణ లేకపోయి ఉంటే తాను గాయాల పాలయ్యేవాడినని అన్నారు. ఆ ఘటనపై దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు షా.
సానుభూతి కోసం టీఎంసీ కార్యకర్తలే ఈశ్వర్ చంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు అమిత్ షా. బంగాల్లో ఎన్నికల సంఘం తృణమూల్ పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అమిత్ షా
"ఆరు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. దేశంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. బంగాల్లో తప్ప. టీఎంసీ బంగాల్లోని 42 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. భాజపా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బరిలో ఉంది. ఎక్కడా హింస జరగలేదు. ఆరు విడతల్లోనూ బంగాల్లో ఘర్షణలు జరిగాయి. దీన్ని గమనిస్తే నిన్న జరిగిన హింసకు తృణమూల్ పార్టీనే కారణమని స్పష్టమవుతోంది. భాజపా కాదు. "
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
ఇదీ చూడండి: ఈ కాశీవాసిని దీవించండి: నరేంద్ర మోదీ