ఈ శానిటైజేషన్ టిప్స్‌తో కరోనాకు చెక్! - సబ్బతో చేతులు శుభ్రం
కరోనాపై పోరులో భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. దానితో పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సరైన రీతిలో శానిటైజర్లు వాడటం, మాస్కులు పెట్టుకోవడం అత్యంత కీలకం. మరి ఎలాంటి శానిటైజర్ వాడాలి? సబ్బులు వాడితే సరిపోతుందా?
కరోనా కల్లోలిత కాలమిది.. ఏది ముట్టుకోవాలన్నా భయం. ఏం చేయాలన్నా సందేహం. నిత్యావసరాలు, కూరగాయలు కొనాలన్నా.. ఇంటికి తెచ్చుకోవాలన్నా.. ప్రతి దానికీ వైరస్ భయమే. అయితే భౌతిక దూరం పాటించడంతో పాటు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి ముప్పు నుంచి చాలామేర తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తల్లో సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడంతో పాటు సరైన రీతిలో శానిటైజర్లు వాడటం, మాస్కులు పెట్టుకోవడం అత్యంత కీలకం. సబ్బు, శానిటైజర్.. ఏది మేలు? ఏ సబ్బు వాడాలి? ఎలాంటి శానిటైజర్లు మంచివి? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారో చూద్దాం.
- మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అతి ముఖ్యమైనది తరచుగా సబ్బు, నీళ్లతో చేతులు కడుక్కోవడం. దీనికి ఇంట్లో వాడే ఏ సబ్బు అయినా మంచిదే. అయితే చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీళ్లు అందుబాటులో లేనప్పుడు మాత్రమే శానిటైజర్లను వాడాలి. కొవిడ్‌ను అడ్డుకునేందుకు తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా వాడే శానిటైజర్లలో కనీసం 60 శాతం ఆల్కాహాల్ ఉండాలి. లేనివి వద్దేవద్దు. కనీసం 20 సెకెన్లకు తగ్గకుండా చేతులను మూలమూలనా శుభ్రం చేసుకోవాలి.
- శానిటైజర్లను ఇంటివద్ద చేసుకోవడం సరికాదని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సూచిస్తోంది. దీన్ని సరిగా చేయకపోతే పనిచేయకపోగా కొన్ని దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
- శానిటైజర్లను వేడి ప్రాంతాల్లో నిల్వ ఉంచకూడదు. ఉదాహరణకు వేసవి నెలల్లో కారు లోపల వీటిని వదిలేయకూడదు.
- ఆరేళ్లలోపు పిల్లలు శానిటైజర్లను వాడేటప్పుడు తప్పక పెద్దవాళ్లు పర్యవేక్షించాలి. పొరపాటున నోటిలోకి వెళితే ప్రమాదకరం. వీటిని కళ్లకు దూరంగా ఉంచాలి. శానిటైజర్ చేతులకు రాసిన తర్వాత పూర్తిగా ఆరిపోనివ్వాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు, పండ్లపై శానిటైజర్లు వాడకూడదు. ఇది ప్రమాదకరం కూడా. వీటిపై వైరస్ ఉంటే అది శానిటైజర్ల ద్వారా పోతుందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారం లేదు. శానిటైజర్లను మన చేతులు, శరీరభాగాలు, లోహపు, స్టీల్ వస్తువులు, నునుపైన తలాలపై వైరస్‌ను పోగొట్టడానికి మాత్రమే వాడాలి.
- కొరియర్ వచ్చినప్పుడు అది ప్లాస్టిక్ లేదా లోహంతో తయారైనదైతేనే శానిటైజ్ చేయాలి. కాగితంపై వైరస్ మనుగడ సాగించలేదు. కొరియర్ లేదా పోస్టులో వచ్చినవాటిని తీసుకునేటప్పుడు సంతకం చేయాల్సి వస్తే సొంత పెన్నును వాడటమే మేలు.