దేశంలోని ఇతర ప్రాంతాల వారు.. జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణపై పీడీపీ మండిపడింది. దీని వల్ల కశ్మీర్లో నేరాలు పెరిగిపోతాయని.. ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.
కశ్మీర్లో ఎవరు భూములు కొనుక్కోరని.. కానీ ప్రభుత్వ చర్యల వల్ల స్థానికులకు భారీ నష్టం తప్పదని పీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ చట్టసభ్యుడు సురిందర్ చౌదరి ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా గాంధీ నగర్‌లోని పీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సురిందర్.
"పట్టపగలే అత్యాచారాలు జరిగే రోజును మనం అందరం చూస్తాం. జమ్ముకశ్మీర్‌లో నేరాలు పెరిగిపోతాయి. ఈ చట్టం వల్ల ఎవరైనా వచ్చి జమ్ముకశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయవచ్చు. జమ్ముకశ్మీర్‌ను భాజపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టినప్పటికీ.. ఒక్క అంగుళాన్ని కొనడానికి కూడా ఎవరూ ముందుకు రారు."