దేశ రాజధాని దిల్లీలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశల వారిగా లాక్‌డౌన్ తొలగించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరింత కాలం లాక్‌డౌన్ పొడిగించే పరిస్థితి లేదని, గతేడాది ఏప్రిల్ నెలలో రూ.3500 కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.300 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఎక్కువ కాలం లాక్‌డౌన్ కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని...ప్రభుత్వం పనిచేయడం కూడా కష్టమవుతుందని అన్నారు. అందుకోసమే లాక్‌డౌన్ నిబంధనలు సడలించనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు మార్చి 24న లాక్‌డౌన్ విధించాలన్న కేంద్రం నిర్ణయం ఎంతో ముఖ్యమైందని, ఒక వేళ దేశంలో లాక్‌డౌన్ విధించకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరస్థాయిలో ఉండేదని అన్నారు. కంటైన్‌మెంట్ జోన్లు పూర్తిగా మూసేయాలని, గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో దుకాణాలు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
"దిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైంది. మనం కరోనాతో కలిసి జీవించేందకు సిద్ధమవ్వాలి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత, కేసులు నమోదయినా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు.