దేశీయంగా ఆయుధాలను తయారీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని రక్షణమంత్రి రాజ్నాథ్ ఉద్ఘాటించారు. దిల్లీలో జరిగిన ఆత్మనిర్భర్ వారోత్సవానికి హాజరైన రాజ్నాథ్ ఈ వ్యాఖలు చేశారు. రక్షణ వ్యవస్థ, మౌలిక వసతుల్లో పెట్టుబడులు, భవిష్యత్తులో ఆయుధాల తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన చర్యలను చేపడతామని వెల్లడించారు.
101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధంవిధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు రాజ్నాథ్. ఈ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
"తొలిసారిగా 101 పరికరాల జాబితాను రూపొందించాం. వీటిని దిగుమతి చేసుకోము. ఇందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో.. మరికొన్ని పరికరాలను ఈ జాబితాలో చేర్చుతాం. దీంతో కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. రక్షణ రంగంలోని పీఎస్యూలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఆ మార్గంలో పనిచేస్తున్నాయి. రక్షణ దళాలకు ఈ పరిశ్రమలు వెన్నెముక లాంటివి. దేశంలోనే వస్తువులను తయారు చేసుకునే సామర్థ్యం వస్తే.. చాలా డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది. ఈ ఆదా చేసిన సొమ్ముతో రక్షణశాఖకు చెందిన దాదాపు 7వేల ఎమ్ఎస్ఎమ్ఈలకు సహాయం చేయవచ్చు."