దేశవ్యాప్తంగా మూడు పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఒక్కటీ లేకుండా పులులు అదృశ్యమైపోయాయి. ఆశ్చర్యకరమైన ఈ అంశం కేంద్రం విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. 2014తో పోలిస్తే దేశంలో వ్యాఘ్రాల సంఖ్య రెట్టింపైనప్పటికీ.. మిజోరంలోని డంపా, పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా, ఝార్ఖండ్‌లోని పలమౌ సంరక్షణ కేంద్రాల్లో ఒక్క పులి కూడా లేకుండాపోయిందని తేలింది. తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు వెల్లడించింది. కేంద్రమంత్రి జావడేకర్ మంగళవారం ఈ నివేదికను విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వుల్లో 1,923 పులులున్నాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో 231 పులులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటకలోని నాగర్‌హోల్ (127), బాందీపోర్ (126) సంరక్షణ కేంద్రాలు నిలిచాయి. కజిరంగా (అసోం), బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్) సంరక్షణ కేంద్రాల్లో 104 చొప్పున ఉన్నాయి. రాష్ట్రాలపరంగా చూస్తే.. మధ్యప్రదేశ్‌లో గరిష్ఠంగా 526 పులులు ఉండగా, కర్ణాటకలో 524, తెలంగాణలో 26 నివసిస్తున్నాయి.
అడవి కుక్కలు, ఎలుగుబంట్లు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో పులులు తిరిగేచోట అడవి కుక్కలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా వీటి ఆనవాళ్లు చిక్కాయి.
- అమ్రాబాద్, శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటిచోట్ల ఎలుగుబంట్లు ఉన్నాయి.
- ఉత్తర తెలంగాణలో దేశీయ తోడేళ్ల ఆనవాళ్లు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి.