దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్యోదంతం కేసులో మూడో దోషి అక్షయ్ ఠాకూర్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరపనున్నారు. మరోవైపు, 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు ఉరిశిక్ష అమలును వాయిదా వేయించేలా దోషులు తమకు ఉన్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశాలను వెతుక్కుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూఅక్షయ్ ఠాకూర్ గత నెలలో రివ్యూ పిటిషన్ వేయగా సుప్రీం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. తాజాగా న్యాయపరంగా చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
క్షమాభిక్ష తిరస్కారాన్ని సవాల్ చేస్తూ..
ఉరి శిక్షను ఆలస్యం చేసేందుకు ఎన్నో దారులు వెతుక్కుంటున్నారు నిర్భయ దోషులు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై మంగళవారం జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు చూసిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసినట్లు తెలిపింది. ముకేశ్ వాదనలో ఎలాంటి మెరిట్ లేదని స్పష్టంచేసింది.
కాగా... కొద్ది రోజుల ముందే వినయ్, ముకేశ్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటినీ కొట్టివేసింది. ఇవాళ మరో దోషి వినయ్ కుమార్ శర్మ.. క్షమాభిక్ష పిటిషన్ వినియోగించుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చూడండి:బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!