కేరళ తిరువనంతపురానికి చెందిన ఐదుగురు కవలల్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయం ఈ అరుదైన వివాహ వేడకకు వేదికైంది. కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మూడు కొత్త జంటలు ఒక్కటయ్యాయి.
ఒకే వేదికపై ముగ్గురు కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి 1995లో పంచరత్నాలు..
తిరవనంతపురంలోని పోథన్కోడ్కు చెందిన ప్రేమ్ కుమార్, రమా దేవి దంపతులకు 1995 నవంబర్ 18న ఐదుగురు కవలలు జన్మించారు. వీరిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వార్తాంశమైంది. ఐదుగురు కవలలను పంచరత్నాలుగా అభివర్ణించారు.
ఈ పంచరత్నాల్లోని ముగ్గురే ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న ఉథ్రా.. మస్కట్‌లో హేటల్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్న కేఎస్ అజిత్ కుమార్‌ను మనువాడింది. డిజిటల్ మీడియా వృత్తిలో స్థిరపడిన ఉథారా.. కోజికోడ్‌కు చెందిన జర్నలిస్ట్ కేబీ మహేశ్ కుమార్‌ను పెళ్లిచేసుకుంది. అనెస్తేషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మరో సోదరి ఉత్తమ.. మస్కట్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వినీత్‌ను పరిణయమాడింది. ఐదుగురు కవలల్లోని ఒకే ఒక్క సోదరుడు ఉత్తరాజన్.. ఈ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకున్నాడు.
ఈ కవలల తండ్రి ప్రేమ్‌కుమార్ వారి 9వ ఏటనే మరణించారు. అప్పటి నుంచి రమా దేవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేశారు. జిల్లా సహకార బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కుటుంబ కష్టాలను అధిగమించారు. కొద్దిరోజులుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రమా దేవి.. ప్రస్తుతం పేస్‌మేకర్ సాయంతో జీవనం సాగిస్తున్నారు.