తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరు: ఈ సీతలు గీత దాటనీయడం లేదు - మోదీతో సర్పంచ్​ల భేటీ

కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఆ ముగ్గురు సర్పంచులు. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షాత్​ ప్రధాని నరేంద్ర మోదీయే వారి ఆలోచనలను మెచ్చుకున్నారు. మహమ్మారిపై వారి పోరాటపటిమ అందిరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అసలు వారు ఏం చేశారో చూద్దామా?

sita
ఈ సీతలు గీత దాటనీయడం లేదు

By

Published : Apr 25, 2020, 12:23 PM IST

ముగ్గురు మహిళా సర్పంచులు... కరోనాని కట్టుదిట్టంగా కట్టడి చేస్తున్న వనితలు... కష్టకాలంలో ఊరికి భరోసాగా నిలుస్తున్న అతివలు... వారికి ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశం దక్కింది... ఈ క్లిష్ట సమయంలో వారి చొరవ, జనానికి అండగా నిలుస్తున్న వైనం మోదీని మెప్పించాయి... మీలా ముందుండి నడిపించే నాయకులే ఈ దేశానికి కావాలంటూ మెచ్చుకున్నారు... జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం అందుకు వేదికైంది... వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాళ్లు తమ ఆచరణ వివరించారు.

అలుపెరుగక శ్రమిస్తూ: ప్రియాంకా రాందాస్‌ మెడాంకర్

గ్రామం: మెడాంకర్‌వాడి, పుణె (మహారాష్ట్ర)

ప్రియాంకా రాందాస్‌ మెడాంకర్‌

దేశంలో లాక్‌డౌన్‌ రెండో రోజే రంగంలోకి దిగారు. గ్రామంలో వీధివీధికీ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావకాన్ని చల్లించారు. స్కిల్‌ ఇండియా ప్రోగ్రాం కింద మహిళా స్వయంసహాయక బృందాలకు చెందిన కొందరిని ఎంపిక చేసి వారికి ఫేస్‌మాస్కుల తయారీలో శిక్షణ ఇప్పించారు. వారు కుట్టిన ఐదువేల మాస్కులను గ్రామస్థులందరికీ ఉచితంగా పంచారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో హోం క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

ఊళ్లో సామాజికదూరం పాటించేలా పలు చర్యలు చేపట్టారు. రేషన్‌, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు రోజు విడిచి రోజు తెరిచేలా నిబంధలు తీసుకొచ్చారు. బయటికి రాలేని వారికి స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల సాయంతో ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేయించారు. వీటితోపాటు ఈ కష్టకాలంలో ప్రియాంక చేసిన మరో మంచి సాయం ఊరిలోని ప్రతి మహిళకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్లు అందజేయడం. ప్రియాంక తీసుకున్న చర్యలకు ప్రధాని ముచ్చట పడిపోయారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేలా చూడాలనీ, ఈ-నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) టెక్నాలజీ ఉపయోగించుకోవాలని ఆమెకు సూచించారు.

సాయంలో ముందుంటూ: వర్షా సింగ్‌

గ్రామం: నక్టీ డెయి బుజుర్గ్‌, బస్తీ (ఉత్తర్‌ప్రదేశ్‌)

వర్షా సింగ్‌

మొదట్నుంచీ ఈ గ్రామంలో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలవుతోంది. దీనికోసం ఆ గ్రామ మొదటి మహిళ వర్షా సింగ్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గ్రామస్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఆమె ఆశ, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంల సాయం తీసుకున్నారు. వారితో కలిసి ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి చెప్పారు. స్వయంగా ఫేస్‌ మాస్కులు కుడుతూ, ఇతరులతో కుట్టించి ఇంటింటికీ పంచారు. దాతల సాయంతో పేదలు, యాచకులకు ఆహారం అందిస్తున్నారు. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌, జన్‌ధన్‌ యోజన పథకాల గురించి ప్రధాని అడిగినప్పుడు గ్రామంలో ఎంతమంది లబ్దిదారులున్నారో అంకెలతో సహా వర్ష వివరించారు.

రైతులకు అండగా: పల్లవీ ఠాకూర్‌

గ్రామం: పంచ్‌, పఠాన్‌కోట్‌ (పంజాబ్‌)

పల్లవీ ఠాకూర్‌

పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉండే పంచ్‌ గ్రామ సర్పంచ్‌ పల్లవీ. సొంతూరికి సేవ చేయాలనే సంకల్పంతో పాతికేళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. లాక్‌డౌన్‌ మొదలవగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్లలోంచి బయటికి వెళ్లకుండా, ఇతరులు ఊళ్లోకి రాకుండా చూసేందుకు కొంతమంది యువతను ఎంపిక చేసి వాళ్లతో కలిసి కొద్దిరోజులు తనూ స్వయంగా గస్తీ కాశారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలనీ, సామాజిక దూరం పాటించాలనీ విస్తృత ప్రచారం చేశారు. పంజాబ్‌లో ఇది పంట కోతల కాలం. లాక్‌డౌన్‌ కారణంగా చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికో మార్గం ఆలోచించారు పల్లవీ. చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాల సర్పంచులు, పంట కొనుగోలుదారులతో చర్చించారు. రైతులు ఫలానా సమయానికే మార్కెట్‌కి వెళ్లి పంట అమ్ముకునేలా టోకెన్లు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయేందుకే ఈ ప్రణాళిక. ఆచరణాత్మకంగా ముందుకు సాగుతున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని ప్రశంసించారు. దాంతోపాటు పంటలకు వేసే యూరియా వాడకాన్ని తగ్గించాలని కోరారు. పల్లవి లాంటి యువ సర్పంచులే రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details