తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర'చట్టంపై మిన్నంటిన నిరసనలు.. ముగ్గురు మృతి - Three killed in firing during anti-CAA protest across country

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయి. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో యూపీలో ఒకరు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. అనేక చోట్ల రైళ్లు, బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వేల సంఖ్యలో విద్యార్థులు, విపక్ష పార్టీల సభ్యులు రోడ్లపైకి వచ్చారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Three killed in firing during anti-CAA protest across country
'పౌర'చట్టంపై మిన్నంటిన నిరసనలు.. ముగ్గురు పౌరులు మృతి

By

Published : Dec 20, 2019, 5:38 AM IST

Updated : Dec 20, 2019, 7:53 AM IST

'పౌర'చట్టంపై మిన్నంటిన నిరసనలు.. ముగ్గురు మృతి

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. గురువారం జరిగిన నిరసనల్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. భాజపా పాలిత కర్ణాటకలోని మంగళూరులో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులకు బుల్లెట్‌ గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పరిస్థితి అదుపు తప్పినందున ఇవాళ రాత్రి వరకు మంగళూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో వ్యక్తి మృతి

భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. లఖ్‌నవూలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లురువ్వారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సంభల్‌ జిల్లాలోనూ ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. రేపు మధ్యాహ్నం వరకు లఖ్‌నవూలో అంతర్జాలం, సంక్షిప్త సందేశాలను నిలిపివేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

అటు దిల్లీలోనూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, పాత దిల్లీ, జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకు దూరంగా ఉండాలన్న సూచనలను విస్మరించి దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు, ఆచార్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. 20 మెట్రో స్టేషన్లను మూసివేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఓ వైపు ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా మరోవైపు అంతర్జాల సేవలను, సంక్షిప్త సందేశాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పోలీసుల లేఖ

పౌరసత్వ సవరణ చట్టంపై సామాజిక మాధ్యమాల్లో 60 ఖాతాలు పోస్టు చేసిన అభ్యంతకర విషయాలను తొలగించాల్సిందిగా దిల్లీ పోలీసులు ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌కు లేఖ రాశారు. అటు.. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ హ్యాక్​కు గురైంది. జామియా విద్యార్థుల పోరాటానికి మద్దతుగా హ్యాకింగ్‌ చేశామని హ్యాకర్లు వెబ్‌సైట్‌లో ఉంచారు.

మధ్యప్రదేశ్​లోని 43 జిల్లాల్లో 144 సెక్షన్​

కాంగ్రెస్‌ పాలిత మధ్యప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఆందోళనలు ఎగసిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని 43 జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని షాహీ ఆలంలో నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అహ్మదాబాద్‌లోనే మీర్జాపూర్‌ ప్రాంతంలో జరిగిన మరో ఘర్షణలో 20 మంది నిరసనకారులు గాయపడ్డారు.

Last Updated : Dec 20, 2019, 7:53 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details