తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు తరాలుగా వెంటాడుతున్న రుణపాశం - panjab

ఒక్కసారి చేసిన తప్పు తరతరాలుగా వెంటాడుతుంది అంటారు పెద్దలు.. కానీ ఓ రైతు కుటుంబాన్ని చేసిన తప్పు కాదు అప్పు వెంటాడుతోంది. రుణ భారం ఆ కుటుంబాన్ని మూడు తరాలుగా వెంటాడి ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. ముత్తాత, తాత, తండ్రి, మనుమడు, మరో ఇద్దరి ఊపిరి తీసేసింది. మగదిక్కు లేక ఆ కుటుంబం విలవిలలాడుతోంది. ఉదారమైన ఈ సంఘటన పంజాబ్​లోని బోత్నా గ్రామంలో చోటు చేసుకుంది.

మూడు తరాలుగా వెంటాడుతున్న రుణపాశం

By

Published : Sep 14, 2019, 5:31 PM IST

Updated : Sep 30, 2019, 2:37 PM IST

అప్పుడెప్పుడో చేసిన అప్పు.. ఓ రైతు కుటుంబాన్ని మూడు తరాలుగా మింగేసింది. 50 ఏళ్లుగా తీరని శాపమై ఆరుగురికి మరణశాసనం రాసింది. ముత్తాత, తాత, తండ్రి, మనుమడు, మరో ఇద్దరి ఊపిరి తీసేసింది. ఆ ఇంట మగవాళ్లే లేకుండా చేసింది. ముగ్గురు మహిళలను అనాథలను చేసి రోడ్డున పడేసింది. ఇంత జరిగినా కొండలా అప్పు మిగిలే ఉంది. పంజాబ్‌లోని బోత్నా గ్రామంలో గుండెలు బరువెక్కించే వ్యథార్థగాథ ఇది.

1970లో రైతు జోగీందర్‌ సింగ్‌ ఓ కమీషన్‌ ఏజెంట్‌ నుంచి అవసరాల కోసం అప్పు చేశారు. అది తీర్చలేక పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఆ రుణభారంతోనే 1980లో అతని సోదరుడు భగవాన్‌సింగ్‌ ఉరేసుకున్నారు. 2000, 2010ల్లో జోగీందర్‌ కుమారుడు, మరొకరు బలవన్మరణం పాలయ్యారు. ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జోగీందర్‌ మనుమడు కుల్వంత్‌ సింగ్‌ 2018 జనవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఆ కుటుంబంలో మిగిలిన ఒకేఒక్క మగవాడు, కుల్వంత్‌ కుమారుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ (21) కూడా అప్పు తీర్చే శక్తి లేక ఈనెల 10న పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

పాపంలా పెరిగిన వడ్డీభారంతో ఇంకా రూ.15 లక్షల అప్పు మిగిలే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో లవ్‌ప్రీత్‌ అవ్వ(70), తల్లి(50), సోదరి(23) మాత్రమే మిగిలారు. జోగిందర్‌కు అప్పట్లో 13 ఎకరాల భూమి ఉండేది. అప్పుపై వడ్డీ చెల్లించేందుకే ఆ కుటుంబం ఏటా కొంత చొప్పున 12.5 ఎకరాలు అమ్ముకుంది. చివరకు లవ్‌ప్రీత్‌కు అర ఎకరా మాత్రమే మిగిలింది. ఆ మాత్రం భూమిపై వచ్చే ఆదాయంలో అప్పుకట్టే మార్గం తెలియక అతనూ తనువు చాలించాడు.

ఇదీ చూడండి:ప్రజాగ్రహం: పోలీసులు అయితే సీటు బెల్టు పెట్టుకోరా?

Last Updated : Sep 30, 2019, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details